అల్లరి వేళల అప్రమత్తం | Half day schools until April 24th | Sakshi
Sakshi News home page

అల్లరి వేళల అప్రమత్తం

Mar 25 2026 5:44 AM | Updated on Mar 25 2026 5:44 AM

Half day schools until April 24th

ఏప్రిల్‌ 24 వరకూ ఒంటిపూట బడులు 

మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు 

ఆనక ఆటలకే సమయం వెచ్చిస్తున్న చిన్నారులు 

వేసవి తాపం వేళ ఈతలకు దిగుతున్న వైనం 

సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదం 

కనిపెట్టుకుని లేకుంటే మూల్యం చెల్లించాల్సిందే 

రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. 

ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  

ఫేట్‌ మారుస్తున్న ఫీట్స్‌.. 
దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్‌ సర్వే సారాంశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. 

స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. 

కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్‌ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్‌ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు.  

అధికారులు చర్యలు తీసుకోవాలి 
ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్‌లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది.

తేలికపాటి ఆహారం మంచిది...
వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది.    – డాక్టర్‌ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్‌సీ, రంగంపేట  

మండుటెండల్లోనే ఆటలు
విద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

రవి కిరణాలతో ప్రమాదం
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు.

ఆటలలో అజాగ్రత్త వద్దు
విద్యార్థులు స్మార్ట్‌ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి.   మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement