
శరవేగంగా జరుగుతున్న పోలవరం అప్రోచ్ చానల్ పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వైపు గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే అప్రోచ్ చానల్ తవ్వకం పనులను జల వనరుల శాఖ అధికారులు వేగవంతం చేశారు. సుమారు కోటి క్యూబిక్ మీటర్ల మట్టి పనులను చేస్తే ఈ చానల్ పూర్తవుతుంది. ఈ మేరకు జల వనరుల శాఖ అధికారులు రూపొందించిన డిజైన్‌కు ఈనెల 23న డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం విధించిన గడువు మే లోగా పనులను పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. గోదావరి డెల్టాలో రబీ పంటలకు ఈ నెల 31 వరకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్‌ల ఇరు వైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తారు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు జూన్ మొదటి వారంలో నీటిని విడుదల చేస్తారు. జూన్‌లోనే గోదావరికి వరద ప్రవాహం వస్తుంది. ఆలోగా స్పిల్‌వే, స్పిల్ చానల్‌ను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్‌వే వైపు ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ చానల్‌ను పూర్తి చేయాలి. కానీ ఇన్నాళ్లూ అప్రోచ్ చానల్ డిజైన్‌ను డీడీఆర్పీ ఆమోదించక పోవడంతో వాటి పనులను చేపట్టలేని పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఆ సమస్య లేనందున పనులు వేగంగా పూర్తి చేయనున్నారు. మొదట్లో అప్రోచ్ చానల్‌ను 550 మీటర్ల వెడల్పుతో 450 మీటర్ల పొడవున తవ్వితే సరిపోతుందని.. ఈ లెక్కన 50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి వస్తుందని లెక్క వేశారు.
సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నివేదిక ఆధారంగా స్వల్ప మార్పు
గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా స్పిల్‌వే వైపు మళ్లించడానికి అప్రోచ్ చానల్‌ను ఎలా తవ్వాలనే అంశాన్ని పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) శాస్త్రవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాయి. పీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో 3–డీ పద్ధతిలో నమూనా పోలవరం ప్రాజెక్టును నిర్మించిన శాస్త్రవేత్తలు.. లక్ష క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో అంతే ఒత్తిడితో స్పిల్ వైపు నీటిని పంపింగ్ చేస్తూ.. అప్రోచ్ చానల్ తవ్వకంపై అధ్యయనం చేశారు. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా నది నుంచి అప్రోచ్ చానల్‌ను ప్రారంభంలో 550 మీటర్ల వెడల్పుతో.. ఆ తర్వాత చానల్ వెడల్పును 600, 650, 700, 750, 800, 850, 900, 950 మీటర్లకు పెంచుతూ.. స్పిల్ వేకు సమీపంలో దానికి సమానమైన రీతిలో అంటే వెయ్యి మీటర్ల వెడల్పుతో తవ్వడం ద్వారా ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేయొచ్చని తేల్చారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన డీడీఆర్పీ.. ఆ నివేదికతో ఏకీభవించి, డిజైన్‌కు ఆమోద ముద్ర వేసింది. డిజైన్ మారిన నేపథ్యంలో అప్రోచ్ చానల్‌లో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వరద వచ్చేలోగా పనులు పూర్తి
గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు నీటిని ఇవ్వాలన్నా, ఇటు వరద ప్రవాహాన్ని సులభంగా దిగువకు విడుదల చేయాలన్నా మే లోగా అప్రోచ్ చానల్ తవ్వకం పనులను పూర్తి చేయాలి. ఈ పనులను ఈనెల 24న ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రొక్లెయిన్లు, టిప్పర్లను మోహరించిన కాంట్రాక్టు సంస్థ.. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రోజుకు 1.50 లక్షల నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వడం ద్వారా గడువు కంటే ముందే పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా జూన్‌లో వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. కాఫర్ డ్యామ్‌ల మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నాయి.