Gas Cylinder Exploded: గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం... రూ 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం

Gas Cylinder Exploded House Burnt Completely - Sakshi

ముంచంగిపుట్టు: బంగారుమెట్ట పంచాయితీ వదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్‌ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వదనపల్లిలో కొర్రా సన్యాసిరావు ఇంటిలో సాయంత్రం అతని భార్య బాలబుడి టీ పెట్టడం కోసం గ్యాస్‌ స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్‌ పైప్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుంది.

ఈ విషయాన్ని గమనించకపోవడంతో స్టౌ వెలిగించిన వెంటనే సిలిండర్‌ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సన్యాసిరావు, అతని భార్య బాలబుడి, మనవరాలు భవానీతో  బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది, గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.రూ.90వేలు డబ్బులతో పాటు 10 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్‌ కార్డు, గృహోపకరణ వస్తువులు  కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు.

ఈ ప్రమాదంలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు సన్యాసిరావు, బాలబుడి తెలిపారు. తహసీల్దార్‌ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కొండమ్మ, వైఎస్సార్‌సీపీ మండల నేత జగన్నాథం, వీఆర్‌వో రమేష్‌లు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు రేషన్‌ సరుకులు అందించారు.   

(చదవండి: ప్లాస్టిక్‌ నిషేధం తక్షణ అవసరం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top