కిలోమీటర్‌కు రూ.53.88 కోట్లు! | Fraud among tenders for construction of major roads in Amaravati | Sakshi
Sakshi News home page

కిలోమీటర్‌కు రూ.53.88 కోట్లు!

Jan 29 2025 5:31 AM | Updated on Jan 29 2025 5:31 AM

Fraud among tenders for construction of major roads in Amaravati

అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లలో గోల్‌మాల్‌

ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సగటున రూ.20–22 కోట్లు వ్యయం

అదీ జీఎస్టీ, సీనరేజీ, నాక్‌ వంటి అన్ని పన్నులతో కలిపి..

ఈ సర్కార్‌లో పన్నులు కాకుండానే కనిష్టంగా రూ.24.88 కోట్లు వ్యయం

ఈ లెక్కన మిగిలిపోయిన రోడ్ల వ్యయం తడిసి మోపెడు

సగటున కి.మీకు గరిష్టంగా రూ. 31.88 కోట్ల మేర పెంపు

అంచనాల దశలోనే కమీషన్ల కోసం ముఖ్య నేతలు బేరసారాలు  

అడిగినంత కమీషన్‌ ఇచ్చేందుకు నాలుగు సంస్థలు అంగీకారం

వాటికే పనులు దక్కేలా నిబంధనల రూపకల్పన

రూ.3,405.57 కోట్లతో 11 రహదారుల పనులకు వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్లు

‘మీకింత.. మాకింత’ అంటూ వసూళ్లకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం

ఫలితంగా మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు

మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు? సిమెంటు దగ్గర నుంచి స్టీలు, కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బేరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించిన మేస్త్రీకే వాటిని అప్పగిస్తారు. 

ఎందుకంటే అప్పు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి. తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృథా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి. ఎవరైనా సరే ఇలానే చేస్తారు. 

కానీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి.. ‘మీకింత.. మాకింత’ అంటూ కమీషన్లు దండుకునేందుకు రాజధాని రహదారుల పనుల్లో బరితెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతోంది.  

సాక్షి, అమరావతి: దేశంలో ఒక కిలోమీటర్‌ పొడవున ఆరు లేన్‌ (ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు) జాతీయ రహదారిని సగటున రూ.20–22 కోట్లతో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తోంది. అదీ.. అన్ని రకాల పన్నులు అంటే జీఎస్టీ, నాక్‌ (నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ), సీనరేజీతో కలిపి. 

కానీ.. రాజధాని అమరావతిలో అదే ఆరు లేన్‌లతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలి పోయిన పనులకు కిలోమీటర్‌కు గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్‌ చేస్తామని పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రధాన రహదారుల పనులను.. అదీ మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని కిలోమీటర్‌కు గరిష్టంగా రూ.31.88 కోట్లు, కనిష్టంగా రూ.24.88 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 

రాజధాని ప్రాంతంలో చేపట్టిన 11 ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.3,405.57 కోట్ల వ్యయంతో వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా ఆ నోటిఫికేషన్‌లో నిబంధనలు పెట్టారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 

రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే సగటున 4 నుంచి 5 శాతం అధిక ధరలకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణం నుంచి కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ముట్టజెప్పి, వాటినే కమీషన్‌ల రూపంలో వసూలు చేసుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకున్న రుణాన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి దోచుకుంటుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు, అధికారులు విస్మ­యం వ్యక్తం చేస్తున్నారు.  

అంచనాల్లో గోల్‌మాల్‌ 
రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు రుణంగా తీసుకుంది. రాజధాని అమరావతిలో 11 ప్రధాన రహదారుల పనులను ఏడీసీఎల్‌ చేపట్టింది. ప్రధాన రహదారుల్లో మిగిలిపోయిన పనులకు ఈ నెల 4, 9న టెండర్‌ నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించనుంది. 

ఆరు లేన్‌లు.. ఒక్కో వైపు 50 మీటర్ల వెడల్పు(ఒక్క ఈ–3 రహదారి మాత్రమే ఒక్కో వైపు 60 మీటర్లు వెడల్పు)తో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిన పనులకు అంచనా వ్యయాలను ఖరారు చేయడంలో భారీ ఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్లు ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 

ప్రధాన రహదారులతోపాటు వరద నీటిని ఒడిసి పట్టడానికి, తాగునీటి సరఫరాకు, మురుగు నీటిని తరలించడానికి, భూగర్భ విద్యుత్‌ సరఫరా.. పంపిణీ, ఆర్‌సీసీ డక్ట్‌.. 220/33 కేవీ, 415 కేవీ విద్యుత్‌ తీగల ఏర్పాటుకు హెచ్‌డీపీఈ పైపు లైన్, ఆఫ్టికల్‌ పైబర్‌ కేబుల్‌కు, హెచ్‌డీపీ పైపు లైన్, సైకిల్‌ ట్రాక్, రహదారికి ఇరు వైపులా చెట్లు నాటడం తదితర పనుల్లో ఒక్క విద్యుత్‌ సరఫరా మినహా తక్కినవన్నీ ఇదే రీతిలో చేపడుతోంది.

వాస్తవానికి ఎన్‌హెచ్‌ఏఐ.. జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి అన్ని రకాల పన్నులతో కలిపి ఆరు లేన్‌ జాతీయ రహదారి (సరీ్వసు రోడ్లతో కలిపి) నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.20–22 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ లెక్కన.. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ వ్యయం అంతకన్నా పెరగడానికి వీల్లేదు. 

ఎందుకంటే జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నులను అదనంగా కాంట్రాక్టు సంస్థకు రీయింబర్స్‌ చేస్తామని ఏడీసీఎల్‌ నిబంధన పెట్టింది కాబట్టి. ఆ పన్నుల విలువతో భూగర్భ విద్యుత్‌ సరఫరా వ్యవస్థ, సైకిల్‌ ట్రాక్‌ తదితరాలను నిరి్మంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ గరిష్టంగా రూ.53.88 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

నాలుగు సంస్థలకే పనులు!  
ప్రధాన రహదారుల్లో మిగిలి పోయిన పనులకు సంబంధించి అంచనాల దశలోనే పలు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ముఖ్య నేతలు బేరసారాలు జరిపారనే చర్చ అప్పట్లో సాగింది. నాలుగు సంస్థలు అడిగిన మేరకు కమీషన్‌లు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఏడీసీఎల్‌ అధికార వర్గాలకు ముఖ్య నేతలు నిర్దేశించినట్లు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 11 రహదారుల పనుల టెండర్లలో ఒక్కో టెండర్‌లో నాలుగింటిలో మూడు సంస్థలు షెడ్యూలు దాఖలు చేసేలా.. కనిష్టంగా 4 నుంచి 5 శాతం అధిక ధరకు కోట్‌ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. షెడ్యూలు దాఖలుకు తుది గడువు ముగిశాక, ఆరి్థక బిడ్‌ను తెరిచి కనిష్టంగా కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థకే పనులు అప్పగించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement