268 టన్నుల ఇనుమును కొట్టేశారు | Former MLA Rachamallu Siva Prasad Reddy criticizes kondareddy | Sakshi
Sakshi News home page

268 టన్నుల ఇనుమును కొట్టేశారు

Jun 12 2026 4:33 AM | Updated on Jun 12 2026 4:33 AM

Former MLA Rachamallu Siva Prasad Reddy criticizes kondareddy

పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన దీని విలువ రూ.2 కోట్లు 

ఈ దోపిడీ వెనుక టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డి 

కొండారెడ్డి నిర్మిస్తున్న సన్‌రైజ్‌ కౌంటీకి ఈ కడ్డీలనే వినియోగించారు 

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శ 

దోషులపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిక

ప్రొద్దుటూరు: హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రూ.2 కోట్ల విలువైన 268 టన్నుల ఇనుప కడ్డీల మాయం వెనుకప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి హస్తం ఉందని, ఆయన నిర్మిస్తున్న సన్‌ రైజ్‌ కౌంటీ అపార్ట్‌మెంట్‌కు ఈ కడ్డీలే వినియోగించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన  మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఇనుప కడ్డీలు మాయమైతే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోయాయంటూ వరదరాజులరెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

2025 సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు మార్కెట్‌యార్డు గోడౌన్‌లో కడ్డీలు ఉన్నాయని, ఆ తర్వాత మాయమయ్యాయని స్వయంగా హౌసింగ్‌ పీడీ రాజారత్నం ప్రకటించిన వీడియోను రాచమల్లు చూపించారు. ‘గత నెల 14వ తేదీన పీడీ గోడౌన్‌ను సందర్శించిన అనంతరం ఏఈ సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, 28న కేసు నమోదు కావడం జరిగింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ దొంగతనం జరిగిందని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. 

పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన టన్నుల కడ్డీలు మాయమైతే పోలీసులు ఎందుకు విచారణ జరపడం లేదు?  కేవలం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒత్తిడి కారణంగానే కేసు ముందుకు సాగడం లేదు.   సస్పెండ్‌ అయిన ఏఈ సుబ్రహ్మణ్యంను విచారిస్తే ఒక్క రోజులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మార్కెట్‌ యార్డు గోడౌన్‌కు ఇన్‌చార్జ్‌ ఉన్నారు. లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నాయి.  ఇన్ని ఆధారాలు పెట్టుకుని కేసు విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇప్పటికైనా పోలీసులు విచారించి ఈ దోపిడీ విషయాన్ని తేల్చాలి. 

దోషులపై చర్యలు తీసుకోకపోతే త్వరలో శివాలయం వద్ద నడిబొడ్డున రిలే నిరాహార దీక్ష చేపడుతా’ అని  రాచమల్లు హెచ్చరించారు. ‘తనను గెలిపిస్తే పీఎంఎఫ్‌ను తెరిపిస్తానని, మెడికల్‌ కాలేజీని తీసుకొస్తానని, వరద కాలువను నిర్మిస్తానని, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని ఎమ్మెల్యే చెప్పిన మాటలు డొల్ల అని అందరికీ అర్థమైంది.  క్రికెట్‌ బుకీలంతా ఎమ్మెల్యే పంచనే ఉన్నారు. అండర్‌ డ్రైనేజీ కాలువను నిర్మించలేదు. వర్షాలు వచ్చినప్పుడు కాలువను తలదన్నేలా రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. విచ్చల విడిగా ఇసుకను అమ్ముకుంటున్నారు.  బెల్టు షాపులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు’ అని రాచమల్లు ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement