
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం
నర్సీపట్నం నియోజకవర్గంలో వైద్య కళాశాల భవనాలను పరిశీలించిన మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు
సాక్షి, అనకాపల్లి: ‘‘సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్’’ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో చంద్రబాబు చెప్పుకొన్నట్లు సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు.. కేపిటలిస్ట్ మ్యాన్ (పెట్టుబడిదారీ మనిషి), కార్పొరేట్ మ్యాన్.. ఆయన ఆ వర్గాలకే వత్తాసు పలుకుతారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన, సగానికి పైగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు తమ నాయకుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులతో కలిసి అమర్‌నాథ్ పరిశీలించారు.
వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబు నైజం
‘‘కూటమి ప్రభుత్వం 15 నెలల్లో రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసింది. వీటిలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా... కూటమి ప్రభుత్వం తమకి అవసరం లేదంటూ అత్యంత అన్యాయంగా లేఖ రాసింది. అయినా అనంతపురం సభలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. ఎవరో చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం ఆయనకు బాగా అలవాటు’’ అని అమర్‌నాథ్ విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో ఆంధ్రాలో పాలన సాగిస్తున్న లోకేశ్ ఆంధ్రా కిమ్ అని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ హయాంలోనే వైద్యరంగంలో సంస్కరణలు
ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించి రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని అమర్‌నాథ్ తెలిపారు. ‘‘ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు వెచ్చించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. విజయనగరం, మచిలీపట్నం సహా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు నడుస్తున్నాయి. 150 చొప్పున 750 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.
ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో 2022 డిసెంబరు 30న అప్పటి సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజీ మూడు, ఆసుపత్రి రెండు అంతస్థులు నిర్మాణం పూర్తయ్యాయి. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’’ అని విమర్శించారు.