బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

Food is Being adulterated in East godari district - Sakshi

తూర్పు గోదావరి జిల్లాలో విస్తృతంగా ఆహార పదార్థాల కల్తీ

లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం 

విచ్చలవిడిగా రంగులు, ఎసెన్స్‌ వాడకం 

ప్రమాదంలో ప్రజారోగ్యం 

సాక్షి, రామచంద్రపురం:  బిర్యానీ, నూడిల్స్, చికెన్‌ జాయింట్లు, మటన్‌ ధమ్‌ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్‌లు, స్వీట్లు, పప్పులు, పాలు, నీళ్లు ఇలా కల్తీకి కాదు ఏదీ అనర్హం అన్నట్టు ఉన్నాయి. ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు, హోటల్స్‌లో సేల్స్‌ పెరగటంతో  ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్, సూపర్‌ మార్కెట్‌లు, బేకరీల్లో నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది.  

లెసెన్స్‌లు లేకుండా నిర్వహణ 
ఆహార పదార్థాలు తయారు చేసేవారు, నిల్వ చేసే వ్యాపారస్తులు, రవాణా చేసే సంస్థలు లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆహార భద్రతా నియమావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే సెక్షన్‌ 63 ఎఫ్‌ఎస్‌ఎస్‌సీ యాక్ట్‌ 2006 ప్రకారం కేసులు నమోదు చేసి రూ. 5లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లాలో గల ఆహార పదార్థాల అమ్మకాలు, రవాణా, నిల్వ చేసే వ్యాపార, వాణిజ్య సంస్థలు 75శాతం లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
 
         రంగులు కలిపిన బిర్యానీ శాంపిల్స్‌ను తీస్తున్న ఫుడ్‌ కంట్రోల్‌ జాయింట్‌ కమిషనర్‌ పూర్ణ చంద్రరావు  
విస్తృతంగా దాడులు 
ఆహార కల్తీ నియంత్రణ అధికారులు విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో హోటల్స్, సూపర్‌ మార్కెట్‌లపై దాడులు నిర్వహించగా ఆహార భద్రతా నియమాళికి విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 90శాతం హోటల్స్‌ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూసింది. 30కిపైగా చికెన్, పప్పులు, నిల్వ మాంసం, బిర్యానీ, వంటకాల్లో వాడుతున్న కలర్స్‌ వంటి వాటి శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించారు. 15రోజుల్లో ఫలితాలు రానున్నాయి. వీటిని బట్టి ఆయా షాపులు, హోటల్స్‌పై చర్యలు తీసుకొంటారు.  

నిల్వ మాంసంతో సమస్యలు
చికెన్, మటన్, బిర్యానీ, బేకరీల్లోను, స్వీట్స్‌ తయారీల్లోను ఎసెన్స్, సింథటిక్‌ రంగులు అధికంగా వేస్తుండటంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top