
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా, బుధవారం నుంచి తుంగభద్రకు వరద పోటెత్తడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నీటిలో సగభాగం విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్ట్ నుంచి 98,552 క్యూసెక్కులు వచ్చి చేరింది.
రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 49,575 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 8.722 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.892 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 1.60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం సాయంత్రానికి జలాశయంలో 166.3148 టీఎంసీల నీరునిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 875.60 అడుగులకు చేరుకుంది.
తుంగభద్ర జలాశయ 6 గేట్లు ఎత్తివేత
సాక్షి, బళ్లారి/హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని నదిలోకి వదిలారు. ఎగువన శివమొగ్గ జిల్లా, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడంతో నది ప్రవాహం తుంగభద్ర జలాశయానికి పోటెత్తింది. జలాశయం ప్రస్తుత పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. కొత్త గేట్ల ఏర్పాటు దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీలకు కుదించారు. జలాశయానికి అమర్చిన 33 క్రస్ట్ గేట్లు దెబ్బతిని వరద ఉద్ధృతికి తట్టుకోలేని స్థితిలో ఉండడంతో వాటి స్థానంలో రూ.41.56 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేసేందుకు 80 టీఎంసీల వరకే నిల్వ ఉంచుతూ మిగిలిన నీటిని దిగువకు వదలనున్నారు.
దీంతో బుధవారం ఆ మట్టానికి నీరు చేరువవడంతో 6 గేట్లను ఎత్తి 9,400 క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతోపాటు రివర్ ఔట్ ఫ్లో స్లూయీస్ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, 701 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 32,787, ఔట్‌ఫ్లో 11,101 క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు.