
విశాఖ కలెక్టర్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ మెసేజ్‌లు
సాక్షి, విశాఖపట్నం: ‘హాయ్.. నేను మీ కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ని.. ఎలా ఉన్నారు? అర్జెంట్‌గా ఒక రూ.10,000 కావాలి.. పంపిస్తారా?’ అంటూ ఆదివారం కొంతమంది అధికారులు, సామాన్యులకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు వచ్చాయి. స్వయంగా కలెక్టర్ ఆత్మీయంగా పలకరిస్తూ మెసేజ్‌లు రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురై.. కొందరు ప్రతిస్పందించగా.. మరికొందరు అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
ఫేక్ అకౌంట్లతో సామాన్యుల్ని దోచుకుంటున్న సైబర్ నేరస్తులు.. ఇప్పుడు ఏకంగా విశాఖ కలెక్టర్ పేరుతోనే ఫేస్‌బుక్‌లో అకౌంట్ తెరిచారు. అర్జెంటుగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు హోరెత్తించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ పేరుతో డబ్బులు కావాలంటూ సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే దీనిపై సైబర్ సెల్‌కు కూడా సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.