తిరుమల వేంకటమే.. అక్కడున్నది వేంకటేశ్వరుడే

Facts About Titumala Tirupati Temple Unknown To People - Sakshi

తిరుమలపై కొన్ని అసత్య కథనాలు ప్రచారంలో ఉన్న, ప్రచారంలోకి వస్తున్న పూర్వ రంగంలో తిరుమల గురించి సరైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయంపై తెలివి లేకుండా ఏదో అనుకోవడమూ, అసత్యాల్ని ప్రచారం చెయ్యడమూ పెనుదోషాలు.

తిరుమలలో దైవం వేంకటేశ్వరుడు కాదు‌ అది అమ్మవారు అనీ, అక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అనీ, 9వ శతాబ్ది వరకూ అది బౌద్ధ క్షేత్రం ఆ తరువాతి కాలంలో దాన్ని వేంకటేశ్వరుడి ఆలయంగా మార్చేశారు అనీ విన వస్తున్నవి పూర్తిగా అసత్యాలు అని తెలుసుకోగలిగే ఆధారాలు ఉన్నాయి! తిరుమల విషయమై తెలివిడిలోకి వెళదాం రండి...

వామన, గరుడ పురాణాల్లో వేంకటాచల క్షేత్ర ప్రస్తావన ఉంది. బ్రహ్మాండ, వరాహ పురాణాల్లో 'వేంకట' శబ్దానికి వివరణలున్నాయి. "వికటే" అనేదే "వేంకట" పదానికి పూర్వ రూపమనీ, "వేం" అంటే పాపం "కటతి" అంటే కాల్చేది అనీ చెప్పబడింది. పురాతనమైన తమిళ‌ కావ్యాల్లో వెంకటాద్రి ప్రస్తావన ఉంది. సాధారణ శకం 2వ శతాబ్దికి చెందింది తమిళ్ష్ సంగ కాల సాహిత్యం. ఆ సంగ కాలంలోని ఒక తమిళ్ష్ కవి కల్లాడనర్ రాసిన అగనానూరు కావ్యంలో ‌83వ పద్యం (సెయ్యుళ్)లో శ్రీ వేంకటగిరి పైన ఒక ఆటవిక తెగ యువరాజు విహరించిన విశాలమైన మంచి ప్రదేశంలోని వేంకటం అని సూచిస్తూ "తిరువేంగడమలై కళ్షియినుమ్ కల్లా ఇళయర్ పెరుమగన్ పుల్లి వియందలై నన్ నాట్టు వేంగడం" అని చెప్పబడ్డది. ఇక్కడ శ్రీ వేంకట‌గిరి ప్రసక్తీ, వేంకటం ప్రసక్తీ కనిపిస్తున్నాయి.

ఆ కావ్యంలో మరికొన్ని చోట్ల కూడా ఈ వేంకట శబ్దం చెప్పబడ్డది. అంతే కాదు ఆ రచనలో "ఏళీర్ కున్ఱం" ‌అంటే‌ ఏడుకొండలు అన్న ప్రస్తావన కూడా ఉంది.‌ ఈ‌ సంగ కాల సాహిత్యం అన్నది కొందరు రచయితల రచనల సంకలనం. సంగ కాల సాహిత్యం సాధారణ శకం 2వ శతాబ్ది కన్నా పూర్వంది అంటున్న పరిశీలనలు కూడా ఉన్నాయి. ఈ తమిళ‌‌ సంగ‌ కాల సాహిత్యం‌లో మరి కొందరు కవులు కూడా వేంగడం (వేంకటం) గురించి‌ ప్రస్తావించారు. "ఉత్తర వేంకటం నుంచి దక్షిణ కన్యాకుమారి మధ్యన ఉంది తమిళ్ష్ మాట్లాడే మంచి లోకం (వడ వేంగడం తెన్ కుమరి / ఆయిడై తమిళ్ష్ కూఱుమ్ నల్ ఉలగం)" అనే లోకోక్తి చాల పాత నాళ్లలోనే తమిళ్ష్‌లో ఉంది.
 
సాధారణ శకం 3వ శతాబ్దిలో ఇళంగో కవి రాసిన తమిళ్ష్ కావ్యం సిలప్పదిగారమ్‌లో వేంకటేశ్వరుడి వర్ణన ఉంది. ఆ రచనలో "తిరువరంగత్తిల్‌ కిడంద తిరుక్కోలముమ్, వేంగడత్తిల్ నిన్ఱ తిరుక్కోలముమ్" అని ఉంది. అంటే శ్రీరంగంలో (తిరువరంగత్తిల్) పడుకుని ఉన్న పవిత్ర రూపమూ, వేంకటంలో (వేంగడత్తిల్) నుంచుని ఉన్న పవిత్ర రూపమూ అని అర్థం. ఆ రచనలో నుంచుని ఉన్న ఈ రూపంపై వర్ణన పునరావృతం అయింది.  వేంకటమూ, వేంకటేశుడూ గురించి 2, 3 శతాబ్దులకు లేదా అంతకు పూర్వ కాలానికి చెందిన తమిళ్ష్ కావ్యాలలో ప్రస్తావన ఉంది.

అటు తరువాత 3-8 శతాబ్దులకు చెందిన ఆళ్ష్వారుల కాలానికి వేంకటేశుడు వేంకటాద్రితో సహా ప్రసిద్ధమయ్యాడు. ఆళ్ష్వారులు వందల పాసురాల్లో వేంకటేశుణ్ణి కీర్తించారు‌. ఈ ఆళ్ష్వారుల్లో తొలి తరానికి చెందిన పేయ్ ఆళ్వార్ తిరుమలై అనే పదాన్ని వాడారు. పేయ్ ఆళ్వార్ సాధారణ శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలం వారు అని కొన్ని పరిశీలనలు తెలియజేస్తున్నాయి.

తిరుమలై లేదా తిరుమల, తిరుపతి అన్నవి తమిళ పదాలు. తిరు అంటే శ్రీ అని, ఉన్నతమైన అని,‌‌‌ మేలిమి అని, పవిత్రమైన అని అర్థాలు. తిరుమలై అంటే శ్రీ పర్వతం లేదా‌ పవిత్రమైన పర్వతం, ఉన్నతమైన‌ పర్వతం లేదా మేలికొండ అనీ, తిరుపతి అంటే శ్రీపతి లేదా పవిత్రమైన, ఉన్నతమైన నాథుడు అనీ అర్థాలు.

ఈ వివరణల ద్వారా కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా 9వ శతాబ్ది వఱకూ బౌద్ధ క్షేత్రంగా ఉండి ఆ తరువాత అది వేంకటేశం అవలేదని తేట తెల్లంగా తెలియవస్తోంది. అది అమ్మవారి ఆలయమో  సుబ్రహ్మణ్య ఆలయమో కాదు అని కూడా తెలుస్తోంది. అన్నమయ్య‌ "తిరు వేంకటశుడు" అనే పాడారు కదా? అది అమ్మవారో లేదా సుబ్రహ్మణ్యస్వామో అయుంటే అన్నమయ్య వంటి కవికి, భక్తునికి, జ్ఞానికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? అన్నమయ్య కాలానికి తిరుమల దైవం వేంకటేశుడే అని అప్పటి ప్రజలకు బాగా తెలుసు అని మనం గ్రహించాలి. నిజం కానిది, ప్రజల్లో లేనిది అయిన తిరుమల బౌద్ధ క్షేత్రం అనే అబద్ధాన్ని ఇటీవల కొందరు సృష్టించారని స్పష్టంగా అర్థమౌతోంది.

(వెంకట్ అనీ వెంకటేష్ అనీ మనకు అలవాటయింది. అది తప్పు. అది‌ వేంకటం, వెంకటం కాదు.
వేంకట్ అనో వేంకటేశ్ అనో అనడమే సరైంది. ఈ‌ వేంకటేశ అనే పేరు వేదాంత దేశికుల పేరు. వారే ఈ పేరుకు తొలివ్యక్తి.)

7-5-1820 నుండి 10-5-1820 వరకు తిరుమల ఆలయం మూసివెయ్యబడింది. అంతకు ముందు ఆలయం పూర్తిగా వడగలై సంప్రదాయంలో ఉండేది. ఆ మూడునాళ్ల తరువాత తిరుమల ఆలయం వడగలై, తెన్‌గలై సంప్రదాయాల వాళ్లకు ఆమోదయోగ్యంగా ఉండే విధానాల్లోకి‌ మారింది. ఆ సమయంలోనే వేంకటేశ్వరుడి నామం వడగలై, తెన్‌గలై పద్ధతుల్లో కాకుండా ப గా మారింది. కానీ ధ్వజ స్థంభం, రథం, ఏనుగు, గరుడ వాహనం వంటి వాటిపై నామాలు మారకుండా నేటికీ వడగలై పద్ధతిలోనే ఉన్నాయి.

మొదట్లో తిరుమల ఆలయం  పాంచరాత్ర ఆగమ విధానంలో ఉండేది. పాంచరాత్ర ఆలయాల్లో ముందు ధ్వజ స్తంభం తరువాత బలిపీఠం ఉంటాయి. తిరుమలలో మనకు ఈ నిర్మాణమే కనిపిస్తుంది. పాంచరాత్ర ఆలయాలు కొండలపైనా, నదీ తీరాల్లోనూ ఉంటాయి. (శ్రీరంగం నదీ తీరంలో ఉంది) వైఖానస ఆగమ ఆలయాలు ఊరి లోపల ఉంటాయి.

విజయనగర రాజు అచ్యుత దేవరాయల కాలంలో తిరుమల ఆలయం పాంచరాత్ర ఆగమం నుండి వైఖానస ఆగమంలోకి మారింది. అచ్యుతరాయలు‌ వ్యక్తిగత కారణాలతో ఈ మార్పుకు కారణమయ్యాడు.‌ మధ్యలో కొంత కాలం తిరుమల ఆలయం వ్యాసరాయర్ పర్యవేక్షణలో మార్ధ్వ సంప్రదాయంలోనూ ఉండేది. ఇవాళ ప్రధాన గోపురంలో మనం చూస్తున్న విమాన వేంకటేశ్వరుడు ఈ వ్యాసరాయర్ ఏర్పఱిచిందే.

తిరుమలకు ఇవాళున్న ప్రశస్తి‌, ప్రాచుర్యం రావడానికి ప్రధానమైన కారణం రామానుజులు. రామానుజులు జన్మతః వైష్ణవుడు కాదు! స్మార్తుడు లేదా వైదికుడు. జన్మతః స్మార్తుడైన రామానుజులు వైష్ణవ సంప్రదాయ పంచ సంస్కార దీక్షను తీసుకుని వైష్ణవుడు ఆయ్యారు. రామానుజుల్ని వైష్ణవుడుగా మార్చిన గురువు పెరియనంబి. ఈ పెరియనంబి బ్రాహ్మణుడు కాదు శూద్ర అనబడుతున్న వర్గానికి చెందినవారు. ఇది మనకు దిశా నిర్దేశం చేసే చారిత్రిక సత్యం!

ఆళ్ష్వారుల కాలం నుండే వైష్ణవం ఉంది. పొదిగై ఆళ్ష్వార్, బూదత్తు ఆళ్ష్వార్, పేయ్ ఆళ్ష్వార్ వీళ్లు మొదటి ముగ్గురు ఆళ్వార్లు. ఈ ముగ్గురూ వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలంవారు అని కొన్ని పరిశీలనలు, వ్యావహారిక లేదా సామాన్య శకం తొలి శతాబ్దివారు అని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. అటు తరువాత తిరుమళ్షిసై ఆళ్ష్వార్, నమ్మ ఆళ్ష్వార్, తిరుమఙ్‌గై ఆళ్ష్వార్, తొణ్డర్ అడిప్పొడి ఆళ్ష్వార్, పెరియ ఆళ్ష్వార్, ఆణ్డాళ్, కులశేఖర ఆళ్ష్వార్, మదుర కవి ఆళ్ష్వార్, తిరుప్‌పాణ ఆళ్ష్వార్‌లు వచ్చారు. బెంగాల్ లో 15వ శతాబ్దిలో చైతన్య ఏర్పఱిచిన గౌడియ వైష్ణవం, వల్లభాచార్యుల రుద్ర సంప్రదాయం, కర్ణాటక ఉడిపిలో 13వ శతాబ్దిలో మధ్వాచార్యుల మధ్వ సంప్రదాయం, నింబారకుల నింబారక సంప్రదాయం వంటివి వైష్ణవంలో ఉన్నాయి. 

రామానుజుల గురువు పెరియనంబికి పూర్వం వైష్ణవ గురు పరంపర ముక్కాల్ నంబి, ఆళవందార్‌ వంటి వారి మీదుగా శ్రీమత్ నాదమునిగళ్ వఱకూ వెళుతుంది. ఈ నాదమునిగళ్‌ను ఈ‌నాడున్న వైష్ణవానికి ఆదిగా తీసుకోవచ్చు. రామానుజుల తరువాత ఈనాటి వైష్ణవ సంప్రదాయానికి‌ ఊపు వచ్చింది. రామానుజుల తరువాత వైష్ణవంలో వేదాంత దేశికులు ఉన్నతమైన గురువు. అటు తరువాత మనవాళ మామునిగళ్ కాలంలో వడగలై సంప్రదాయమూ, తెన్‌గలై సంప్రదాయమూ  ఏర్పడ్డాయి. ఈ మనవాళ మామునిగళ్ జన్మతః బ్రాహ్మణులు కాదు! ఈడిగ అనబడుతున్న వర్గానికి చెందినవారు మనవాళ మామునిగళ్. ఈ చారిత్రిక సత్యం మనకు కనువిప్పు కలిగిస్తూ సామాజిక వర్గాల అసమానతల్ని తొలగించేది కావాలి. 

వడగలై, తెన్‌గలై సంప్రదాయాల్లో‌‌ నుదుటిపై పెట్టుకునే‌ నామాలలో తేడాలున్నాయి. వడగలై నామం U. ఈ‌ U కి కింద చిన్న గీత పెడితే తెన్‌గలై నామం అవుతుంది. మాధవా, కేశవా అంటూ‌‌ నామాలు చెప్పుకుంటూ గీతలు గీసుకోవడం వల్ల‌ ఈ ముద్రలకు నామాలు అని అనడం వచ్చింది. ఇవాళున్న ఈ వైష్ణవ నామాలు‌ రామానుజుల కాలంలో లేవు.

రామానుజులు ఈ నామాల్ని పెట్టుకుని ఉండరు. ఆయన శ్రీచందనంతో ఊర్ధ్వ పుండరాన్ని పెట్టుకుని ఉంటారు. వడగలై నామం వేదాంత దేశికర్‌తోనూ, తెన్‌గలై నామం‌‌ మనవాళ మామునిగళ్‌తోనూ మొదలైనట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, ఉత్తరాది వైష్ణవ సంప్రదాయాల్లో శ్రీచందనంతో ఉర్ధ్వ పుండరమే ఉంది. ఇస్కా‌న్ కూడా ఈ నామాన్నే తీసుకుంది. ఇవాళ రామానుజల విగ్రహానికి తెన్‌గలై నామం కనిపిస్తోంది. అది ఎంత మాత్రమూ సరికాదు.

రామానుజులకు ముందు,‌ రామానుజులకు తరువాత అని వైష్ణవాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అదే విధంగా తిరుమలను కూడా రామానుజులకు ముందు,‌ రామానుజులకు తరువాత అని పరిగణించాల్సి ఉంటుంది. రామానుజులు తిరమలలో పూజా విధానాలు, సేవలు, పద్ధతులలో పెనుమార్పులు తీసుకువచ్చారు.‌‌ రామానుజులు తిరుమలకు రంజనను, రాణింపును తీసుకువచ్చారు.

సరైన విషయాల్ని తెలుసుకుని తెలివిడితో తిరుమల విషయమై ఇకనైనా సరైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. తిరుమల అమ్మవారి ఆలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో, ఏ బౌద్ధ క్షేత్రమో, మరొకటో కాదు. తిరుమల వేంకటమే; అక్కడున్నది వేంకటేశ్వరుడే.

రోచిష్మాన్
9444012279

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top