
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. కోర్టు ఆర్డర్స్ ఆలస్యంతో కాకాణి ఆలస్యమైంది. గూడూరు కోర్టులో ఉదయమే ఆర్డర్స్ కోసం కాకాణి లాయర్లు అప్లై చేశారు. సాయంత్రం 5:30 గంటలు దాటాక కోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. జైలు రిలీజింగ్ సమయం ముగిసిందని జైలు అధికారులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చిన సంగతి తెలిసిందే. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పు ఇచ్చింది.
‘సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు చేశారు. సహ నిందితుని వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోలేం. దాదాపు 36 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. కాబట్టి సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఏమీ లేదు. దర్యాప్తులో ప్రాథమిక భాగమంతా పూర్తయింది. కాబట్టి దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం లేదు.
కాకాణి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. కాబట్టి ట్రయల్ సందర్భంగా ఆయన హాజరుకాకపోవడం అంటూ జరగదు. కాకాణిపై నమోదైన 14 కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసులన్నింటినీ కూడా సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగా నమోదు చేసినవే. కాకాణి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే. ఈ కేసులో సాక్ష్యం ఇచ్చింది మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే. ఒకే నియోజకవర్గానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న న్యాయ, రాజకీయ పోరాటం ఇది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
కాకాణిపై 13 కేసులు ఉన్నాయని, ఆయనకు బెయిలిస్తే దర్యాప్తులో జోక్యం చేసుకోవడంతోపాటు సాక్షులను బెదిరిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నంత మాత్రాన దానిని నేర చరిత ఉన్నట్లుగా భావించలేమని, ఈ కారణంగా బెయిల్‌ను నిరాకరించలేమని తేల్చి చెప్పారు. కాకాణిపై నమోదైన దాదాపు అన్నీ కేసుల్లోనూ బెయిల్ వచి్చందని, బెయిల్ షరతులను దుర్వినియోగం చేసినట్లు గానీ, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, సాక్షులను బెదిరించినట్లు గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
బెయిల్ ఇస్తే ట్రయల్ సందర్భంగా కాకాణిని కోర్టు ముందు హాజరుపరచడం కష్టమవుతుందన్న వాదననూ న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాకాణి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే కాకాణి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదననూ తిరస్కరించారు. అరెస్ట్‌కు ముందు ఆయన సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు.