కౌలు రైతుల కష్టాలకు చెల్లు

Establishment of groups as per NABARD regulations - Sakshi

కౌలుదారులకు వ్యవస్థాగత పరపతి సౌకర్యం

నాబార్డు నిబంధనల ప్రకారం గ్రూపుల ఏర్పాటు

ప్రతి ఆర్బీకే పరిధిలో కనీసం పది సాగుదారుల సంఘాలు

సీసీఆర్‌సీ కార్డులతో పాటు సాగుదారుల సంఘాలకు రుణాలు

ఆమోదించిన ఎస్‌ఎల్‌బీసీ సబ్‌ కమిటీ

ఇ–పంట ఆధారంగా సాగుదారుల గుర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న కౌలు రైతులకు వ్యవస్థాగత పరపతి సౌకర్యం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంటసాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్‌సీ) ఉన్నా వ్యక్తిగతంగా పంట రుణాలు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు మొగ్గుచూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సాగుదారుల సంఘాలను ఏర్పాటుచేసి వారికి పరపతి సౌకర్యం కల్పించాలని సంకల్పించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా కౌలుదారులకు కార్డులిచ్చినా బ్యాంకర్లు రకరకాల సాకులతో 12–13 శాతం మందికి మాత్రమే పంట రుణాలిచ్చారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ పరిస్థితిని సమీక్షించి.. వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులందరికీ ప్రభుత్వ రాయితీలు, పంట రుణాలు అందేలా చూడాలని, అందుకు సంబంధించి ఏం చేయవచ్చో ఆలోచించమని వ్యవసాయ శాఖను ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఉపసంఘం సమావేశంలో సాగుదారుల సంఘాల ప్రతిపాదన చేసింది.

నాబార్డు నిబంధనల ప్రకారం రుణ అర్హత పత్రాలు, జాయింట్‌ లయబులిటీ గ్రూపులకు (జేఎల్‌జీ) రుణాలిచ్చేందుకు అవకాశమున్నందున ఆ ప్రతిపాదనను చేసింది. ఇందుకు ఎస్‌ఎల్‌బీసీ సబ్‌ కమిటీ కూడా అంగీకరించింది. దీంతో సీసీఆర్‌సీ కార్డులున్న వారితో పాటు జేఎల్‌జీ గ్రూపులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు వ్యక్తంచేసిన సందేహాలను వ్యవసాయ శాఖాధికారులు నివృత్తి చేయడంతో పాటు రుణాల చెల్లింపులో తమ వంతు సాయంచేస్తామని కూడా భరోసా ఇచ్చారు.

సాగుదారుల సంఘాల ఏర్పాటు ఎలాగంటే..
ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో కనీసం పది సాగుదారుల సంఘాలు ఉంటాయి. ఒక్కో సంఘంలో ఐదుగురికి తగ్గకుండా కౌలురైతులు ఉంటారు. నాబార్డు నిబంధనల ప్రకారం రుణాలిప్పించేందుకు వ్యవసాయాధికారులు సహకరిస్తారు. ఇ–పంట నమోదు ఆధారంగా వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. వాళ్లతో మాత్రమే సాగుదారుల సంఘాలు ఏర్పాటవుతాయి. వీటిని ఆయా గ్రామాల వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ధ్రువీకరిస్తారు. ఇ–పంట డేటా ప్రాతిపదికగా నిర్దేశించిన నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలిస్తాయి. సమష్టి బాధ్యత ఉంటుంది గనుక సభ్యులే రుణాలు చెల్లించేందుకు ముందుకు వస్తారని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top