నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందే
లేదంటే నష్టపరిహారం చెల్లించాల్సిందే
డిస్కంలను హెచ్చరించిన ‘ఏపీఈఆర్‌సీ’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. రాష్ట్రంలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరా తీరును మెరుగుపరిచేందుకు బుధవారం కొత్త మార్గదర్శకాలను కమిషన్ జారీ చేసింది. ‘వినియోగదారుల హక్కుల చట్టం 2020’ నిబంధనల ప్రకారం.
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారం విద్యుత్ అందించాలని, మిగిలిన సర్వీసులకు ఎలాంటి కోతలు విధించడానికి వీల్లేదని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.
అంటే ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుడివాడ, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, విజయవాడ, మంగళగిరి, చిలకలూరిపేట, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అనంతపురం, కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, తిరుపతిలో 24 గంటలూ విద్యుత్ అందించాలి.
కరెంటు ఇవ్వకపోతే పరిహారం కట్టాలి
కరెంట్ ఎంత సమయం పోయింది, ఎన్ని సార్లు పోయింది అనే అంశాలపై డిస్కంలకు ఏపీఈఆర్‌సీ రానున్న ఐదేళ్లకు (2026 నుంచి 2031 వరకు) కఠినమైన వార్షిక లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఒకవేళ విద్యుత్ సంస్థలు ఈ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే, వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. ప్రతి మూడు నెలలకోసారి దీనికి సంబంధించిన నివేదికను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏపీఈఆర్‌సీ వెల్లడించింది.


