
నిద్రలేమితో వచ్చే సమస్యలు
చాలామందికి సమస్యగా మారిన నిద్రలేమి
వేధిస్తున్న మానసిక సమస్యలు
సమస్య జటిలంగా ఉందంటోన్న నిపుణులు
జీవనశైలి మార్చుకోవడం మినహా మరో మార్గం లేదని వెల్లడి
⇒ హైపర్ టెన్షన్ (రక్తపోటు)
⇒ ఒత్తిడి పెరిగి మధుమేహం
⇒మతిమరుపు
⇒ గుండె సంబంధిత సమస్యలు
⇒ ఊబకాయం
⇒ మెదడుపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల వ్యసనాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించినా రకరకాల ఒత్తిళ్లు, రుగ్మతలతో రాత్రి ఒంటిగంట దాటినా నిద్ర పట్టడం లేదు. యాభై ఐదేళ్లు దాటిన వారి సంగతి అటుంచితే నిండా ముప్ఫై కూడా లేని కుర్రాళ్లు కూడా ఇబ్బంది పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

30– 40 ఏళ్ల వారిలో ఎక్కువ..
వాస్తవానికి యువకులకు నిద్రలేమి ఉండకూడదు. కానీ మొబైల్ వ్యసనం, బెట్టింగ్‌లు, ఆర్థిక పరిస్థితులు, ఆల్కహాల్, ఉద్యోగాల్లో ఒత్తిడి వెరసి రాత్రి పొద్దు పోయే వరకూ నిద్ర ఉండటం లేదు. మొబైల్‌కు అతుక్కుపోతుండటం అతిపెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 లక్షల మందికి పైగా ముప్ఫై ఏళ్లలోపు యువత చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నట్టు అంచనా. సామాజిక మాధ్యమాల్లో గంటల కొద్దీ ఉండిపోతూ సమయం సంగతే మరిచిపోయిన పరిస్థితి. దీంతో నలభై ఏళ్లు దాటే లోపే జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్టు తేలింది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారికి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది.
జీవనశైలి మార్చుకోవాలి
నిద్రలేమితో బాధపడుతున్న వారు వ్యసనాలను వదులుకోవాలి. జీవనశైలిని మార్చుకుంటేనే పరిష్కారం లభిస్తుంది. వేళకు తినడం, సమయానికి పడుకోవడం, మొబైల్ వినియోగం తగ్గించడం, రోజూ వ్యాయామం వంటివే దీనికి సరైన మందు. ఒక దశ వరకూ నిద్రలేమికి మందులు ఓకే గానీ, మోతాదు మించి వాడకూడదు. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది. –డా.జాషువా కాలెబ్, న్యూరో ఫిజీషియన్