డిస్కంల ప్రతిపాదనలపై రోత రాతలా?

Eenadu false writings on electricity - Sakshi

విద్యుత్‌ వినియోగదారులపై వడ్డీ బాదుడు అంటూ ఈనాడు వక్రరాతలు

ప్రతినెలా విద్యుత్‌ సంస్థలకు సబ్సిడీ సొమ్ములు సకాలంలో చెల్లిస్తున్న ప్రభుత్వం

వర్కింగ్‌ కేపిటల్‌కు ప్రభుత్వ బకాయిలే కారణం అంటూ రామోజీ విషపురాతలు  

స్వల్పకాలిక రుణాలపై వడ్డీని మాత్రమే ఏఆర్‌ఆర్‌లో పొందుపరచాలని ఈఆర్‌సీకి వినతి

వినియోగదారుల నుంచి వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్‌పై ప్రతి ఏటా వడ్డీ 

పొంతనలేకుండా ఈనాడు కథనం ఉందన్న ‘ఏపీఈపీడీసీఎల్‌’ సీఎండీ ఐ.పృథ్వీతేజ్‌

గడచిన నాలుగేళ్లుగా విద్యుత్‌ కొనుగోళ్ల కోసం చేస్తున్న రుణాలకు ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 650 కోట్ల వరకూ డిస్కం అదనంగా చెల్లిస్తోంది. ఇదేమీ కొత్తగా తీసుకున్నది కాదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. రూ. 1,468.98 కోట్లు ఆ ఐదేళ్లలో తీసుకున్నవే.  

సాక్షి, అమరావతి: ప్రభు­త్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి ఓ అబద్ధపు కథనాన్ని అచ్చే­సింది. ‘విద్యుత్‌ వినియోగదా­రులపై వడ్డీ బాదుడు’ శీర్షికన మంగళవారం అభాండాలను రాష్ట్ర ప్రభుత్వంపై వేయాలని ప్రయత్నించింది. కానీ ఎప్పటిలాగే రామోజీ రాతల్లో వాస్తవాలు లేవని తేటతెల్లమైంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు, ఈనాడు కథనంలో అంశాలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) సీఎండీ ఐ.పృథ్వీతేజ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రజలపై భారం వేయడానికి కాదు
సంప్రదాయ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ద్వారా విద్యుత్‌ కొంటే పంపిణీ సంస్థకు దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విద్యుత్‌ వ్యయ చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం విద్యుత్‌ ఒప్పందాలు­(పీపీఏ)కు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తోంది. దానికి బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ ఖర్చు డిస్కంలు భరిస్తున్నాయి.

అదే బహిరంగ మార్కెట్‌లో రోజు వారీ లోటు విద్యుత్‌ కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపు చేయాలి. దానికి డిస్కంల వద్ద తగినంత నగదు లేక పోవడం వల్ల బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకోవ­ల­సివస్తోంది. ఆ రుణాలపై వడ్డీలు కట్టవలసిన బాధ్యత కూడా డిస్కంలపై ఉంది.

ఆ స్వల్పకాలిక రుణాలపై అయ్యే వడ్డీ మాత్రమే సంస్థ వార్షిక ఆదాయ వ్యయ (ఏఆర్‌ఆర్‌) నివేదికలో పొందుపరచాల్సిందిగా విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)ని ఏపీఈపీడీసీఎల్‌ కోరింది. అంతేకానీ ఈనాడు చెప్పి­నట్లు గత నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుకు డిస్కంలు చేసిన ఖర్చుపై వడ్డీ లెక్కించి, ఆ మొత్తాన్ని ప్రతి నెలా విద్యుత్‌ బిల్లుతో కలిపి వసూలు చేయడానికి కాదు. 

ఏపీఈఆర్‌సీకి చెప్పాల్సిందే
విద్యుత్‌ పంపిణీ సంస్థల నిర్వహణకు సహేతుకంగా అయ్యే ఖర్చు మొత్తం నిబంధనల ప్రకారం ఈఆర్‌­సీకి నివేదించాల్సిందే. వాటిపై కమిషన్‌ బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్లను వాడుకుంటున్నందుకు వీలింగ్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అప్పులపై వడ్డీ, వీలింగ్‌ చార్జీలు వర్కింగ్‌ కేపిటల్‌ పరిధిలోకి వస్తాయి. అందువల్ల వీటిని కూడా వాస్తవ ఆదాయ వ్యయాల పద్దులో చేర్చాలని నివేదికలో డిస్కం పొందుపరిచింది.

ప్రభుత్వం సక్రమంగానే ఇస్తోంది
వివిధ సంక్షేమ పథకాలకు, వ్యవసాయ విని­యో­గానికి ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ ప్రతినెల సకాలంలోనే వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలకు ప్రతినెల సర్‌ చార్జీలు విధిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ సరిపోవటం లేదనే వాదన వాస్తవం కాదు.

అంతే కాకుండా విద్యుత్తు వినియో­గదారుల నుంచి వసూలు చేసే సెక్యూరిటీ డిపా­జిట్‌పై ప్రతి ఏటా మే నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన రేట్ల ప్రకారం వడ్డీ మొత్తాన్ని వినియోగదారులకు డిస్కంలు చెల్లిస్తున్నాయి. అయి­తే ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ రూపంలో ఉన్న డబ్బు విద్యుత్తు కొనుగోలు అవసరాలకు సరిపోదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top