
ప్లాస్టిక్ లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లతో ప్రమాదం
90 శాతం విద్యార్థులు ప్లాస్టిక్ భూతాన్ని మోస్తున్న వైనం
ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్సుల వినియోగంతో ప్రాణాంతక వ్యాధులు
అవగాహన కల్పించడంలో విద్య, వైద్యశాఖ విఫలం
మొక్కుబడిగా తల్లిదండ్రుల సమావేశాలు
చైతన్యం చేయాలంటున్న నిపుణులు
నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో చేసిన వాటినే అందరూ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లనే అధికంగా వాడుతున్నారు. వేడి వేడిగా పెట్టిన ఆహారం ప్లాస్టిక్ బాక్స్‌ల్లో పెట్టిన కొన్ని గంటలకే రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ మహమ్మారికి దారితీస్తున్నాయి. ఇంత ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లనే కొనుగోలు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడంలో విద్యా, వైద్యశాఖలు విఫలమవుతున్నాయి.
తిరుపతి సిటీ : రంగు రంగుల డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్స్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్‌తో పిల్లలను ఆకట్టుకునే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్స్‌లు మార్కెట్‌ను ముంచెతు్తతున్నాయి. ప్రతి విద్యార్థి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్స్‌లు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులను తమ వైపు తిప్పుకునే విధంగా ఆకర్షణీయంగా ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. వీటి అమ్మకాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. పలు రకాల వెరైటీలు, తక్కువ ధర, బరువు తక్కువగా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్ల వైపే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆకర్షితులై ప్రాణాంతకమైన రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
అనారోగ్యం, పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా విద్యావంతులు, ఉన్నత వర్గాలు సైతం వీటి వినియోగాన్ని వదలకపోవడం గమనార్హం. ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితంలో భాగమైపోయింది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, పెద్దలు విధులకు హాజరు కావాలన్నా టిఫిన్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేసిన ఆహారం మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసే సమయానికి ఆహారంలో చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
రసాయనాలు కరిగి విషపూరితం
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులతో ప్రమాదమని తెలిసినా మార్కెట్‌లో దొరికే పలు రకాల డిజైన్లు చూసి విద్యార్థులు అటు తల్లిదండ్రులు మోజుపడి కొనుగొలు చేసి వాడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే రోగాలను కొనుగోలు చేసినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరిగించిన వాటర్‌ను, అత్యంత శీతలమైన పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో నింపితే సుమారు 90శాతం కెమికల్స్ అందులో కరిగి ఆ పదార్థాలను విషపూరితం చేస్తాయి.
దీంతో రోగాలు శరీరాన్ని కబళిస్తాయి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు భూమిలో కరగాలంటే కనీసం 450 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికే కాక పర్యావరణానికి ప్రమాదకరం. పాఠశాలలు, కళాశాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సామాజిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.
ప్లాస్టిక్‌తో ప్రాణాంతక వ్యాధులు
ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రో ప్లాస్టిక్స్ అనే రసాయనం అధికంగా ఉండటంతో కొద్ది మోతాదులోనైనా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. దీంతో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. శరీరంలోని గ్రంథులపై ప్రభావం చూపి వాటి పనితీరును మందగిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. అతిశీతలం, అధిక వేడి పదార్థాల కోసం వీటిని వినియోగిస్తే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి కాటేసే ప్రమాదం ఉంది.
ప్లాస్టిక్‌ను ఇలానే వినియోగిస్తే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మంది క్యాన్సర్ బారీన పడే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావుల గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు, యువతలోనూ ప్లాస్టిక్ వినియోగంచడంతో కలిగే అనర్థాలు ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం అధికమవడమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి
పిల్లలకు టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదమే. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడం ద్వారా రుచి, వాసన కోల్పోడంతో పాటు కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి చిన్నారుల అవయవాలపై ప్రభావం చూపుతాయి. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉండే వాటర్ బాటిళ్లు, లంచ్ బ్లాక్స్‌లు వాడటంతో అందులోని కెమికల్స్ పొరలుగా ఆహారంలో కలిసి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.
– డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, తిరుపతి
పేరెంట్స్ మీటింగ్‌ల్లో అవగాహన కల్పించాలి
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పేరెంట్స్ మీటింగ్‌లంటూ హడావుడి చేస్తుంటారు. కానీ అందులో విద్యార్థులకు అవసరమైన విషయాలను తల్లిదండ్రులతో చర్చించడం లేదు. తల్లిదండ్రులకు గేమ్స్ ఏర్పాటు చేసి, టీలు, కాఫీలు ఇచ్చి సంతోషపెట్టి పంపుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడం ఆశ్చర్యమేస్తోంది. పిల్లల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని, నివారణా చర్యలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలేదు. విద్య, వైద్య శాఖాధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. – రాజశేఖర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు, తిరుపతి
స్టీలు, రాగి వస్తువుల వినియోగం శ్రేయస్కరం
ఆధునిక యువత, చిన్నారుల ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. నిద్రలేచిన మొదలు పడుకునే వరకు ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో చేసిన వాటినే వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు దీర్ఘకాలిక సమస్యల చిన్న వయస్సు నుంచే వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం భద్రపరిచి కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఆరగించడంతో అదికాస్త విషంగా మారుతోంది. పలు పరిశోధనలలో ఈ విషయం బయటపడినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం దారుణం. – ప్రశాంతి, ప్లాస్టిక్ వినియోగం–అనర్థాలపై పరిశోధన చేస్తున్న విద్యారి్థని, తిరుపతి
క్యాన్సర్ విజృంభించే ప్రమాదం
సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్లాస్టిక్ భూతం చుట్టుముట్టింది. తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పూరీ్వకులు పాటించిన నియమాలు, అలవాట్లలో ఎంతో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని నేటి తరం అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్సుల వినియోగంతో కాన్సర్ మహమ్మారి దగ్గరవుతోంది. దీన్ని నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేయడం జరిగింది. – కే. భానుప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి, తిరుపతి