Cashew: ‘పశ్చిమ’ జీడిపప్పుకు విశేష ఆదరణ

East Godavari Cashew Industry Famous And More Demand In AP - Sakshi

జిల్లాలో విస్తరించిన పరిశ్రమలు 

రోజుకు 40 టన్నుల వరకు ఎగుమతి 

స్థానికంగా మహిళలకు ఉపాధి  

జిల్లాలో జీడిపప్పు పరిశ్రమ విస్తరిస్తోంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతున్న జీడితోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ‘పశ్చిమ’ జీడిపప్పుకు మంచి గిరాకీ ఉంది.  

దేవరపల్లి: జీడిపప్పు తయారీలో పశ్చిమగోదావరి జిల్లా గుర్తింపు పొందింది. మెట్ట ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. దేవరపల్లి, దూబచర్ల, తాడిమళ్ల ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు జరుగుతున్నాయి. రోజుకు 40 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు.

పరిశ్రమలో తయారు చేసిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి, శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. ఇలా రోజుకు ఒక్కో మహిళ 20 నుంచి 25 కిలోల పప్పును శుభ్రం చేస్తారు. దీని ద్వారా రూ.250 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమల్లో సుమారు 3 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 70 మంది వరకు పనిచేస్తున్నారు. 

100 వరకు పరిశ్రమలు 
జిల్లాలో జీడిపప్పు పరిశ్రమలు 100 వరకు ఉన్నాయి.  
► వీటిలో 50 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి.  
► దేవరపల్లిలో 10, దూబచర్లలో 8, తాడిమళ్లలో 25 వరకు పరిశ్రమలు ఉన్నాయి.  
► జీడిగింజ నుంచి ఐదు రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు.  
► గుండు, బద్దతో పాటు మూడు రకాల ముక్కను తీస్తున్నారు.  
► గుండు, బద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.  
► కె.ముక్క (బద్దలో సగం)కు ఎక్కువ డిమాండ్‌ ఉంది.  
► పప్పుతో పాటు పొట్టు, తొక్కలకు కూడా గిరాకీ ఉంది.  
► జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు ఉంది.   

ముక్కకు డిమాండ్‌  
గుండు, బద్ద కంటే ముక్కకు డిమాండ్‌ బాగా ఉంది. కోవిడ్‌ నిబంధనలు సడలింపులతో ముక్క గిరాకీ పెరిగింది. హోటల్స్‌లో ముక్క ఎక్కువగా వినియోగిస్తారు. బస్తా గింజలకు సుమారు 3 కిలోల ముక్క వస్తుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో పరిశ్రమల ఒడుదుడుకులతో సాగుతోంది. జిల్లాలో పండుతున్న జీడిమామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్‌లో ఆదరణ బాగుంది.   
–పెంజర్ల గణేష్‌కుమార్, కార్యదర్శి, కాజూనట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్, దేవరపల్లి  

తయారీ ఇలా..  
చెట్టు నుంచి జీడి గింజలను సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజలను పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజలను బాయిలర్‌లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొర (పొట్టు)ను కూలీల ద్వారా తొలగించి బద్ద, గుండు, ముక్క తయారు చేస్తారు. ఐదు రకాలుగా పప్పును తయారు చేసి కిలో చొప్పున ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా (80 కిలోలు) గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. బస్తా జీడిగింజల ధర రూ.10,400 ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top