
కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద ధాన్యం లోడు ట్రాక్టర్లు నిలిపి ఆందోళన చేస్తున్న రైతులు
కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద హైవేపై ధాన్యం ట్రాక్టర్లు నిలిపివేసిన రైతులు
తాళ్లపూడి (కొవ్వూరు): ‘ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనడంలేదు. మిల్లర్ల వద్దకు తీసుకువెళితే టార్గెట్ పూర్తయిందని చెప్పి తీసుకోవడం లేదు. మరి మేం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలి..’ అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ రైతులు ప్రశి్నస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ కొవ్వూరు సమీపంలోని గామన్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల రైతులు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద ఉన్న రబీ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యం కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇంకా 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సు«దీర్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డీవో రాణి సుస్మిత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక వచ్చి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.