
13 శాతం దాటని ఈ– పంట నమోదు
రాష్ట్రంలో 2.61 కోట్ల ల్యాండ్ పార్శిల్స్
ఇప్పటి వరకు 21 లక్షల ల్యాండ్ పార్శిల్స్‌లోనే పంట నమోదు
నమోదుగడువు ఈనెల 30
రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలన ఈ –క్రాప్ నమోదు మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఈ –క్రాప్ నమోదులో జరుగుతున్న జాప్యం..రైతుల పాలిట శాపంగా మారుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీతో క్షేత్ర స్థాయిలో ఈ –పంట నమోదు పూర్తి చేయాలి. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకు సోషల్ ఆడిట్‌లో భాగంగా ఆర్‌ఎస్‌కేల్లో ఈ– క్రాప్ జాబితాలను ప్రదర్శించి గ్రామసభలు నిర్వహించాలి. 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 15వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలి.
నమోదు అవసరం ఏమిటి?
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌తో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలకు ఈ–పంట నమోదు ప్రామాణికం. ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో లక్షలాది ఎకరాలు బీడువారగా, మరొక వైపు అధిక వర్షాలు, ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.
ఆ మేరకు రైతులకు పరిహారం ఇవ్వాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరిట రైతుకు ప్రభుత్వం ఇప్పటికే బీమా దన్ను లేకుండా చేసింది. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు జాప్యంతో పంట నష్ట పరిహారం కూడా అందని పరిస్థితి నెలకొంది.
ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై పని భారం
వ్యవసాయేతర అవసరాలకు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్న తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఇప్పటికే ఆర్‌ఎస్‌కే సిబ్బంది వాపోతున్నారు. సవాలక్ష నిబంధనలతో ఈ–పంట నమోదు నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. వ్యవసాయేతర పనుల నుంచి తమను పూర్తిగా మినహాయించి, షెడ్యూల్ ప్రకారం ఈ– క్రాప్ నమోదుకు అవకాశం కల్పిస్తే గడువులోగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
నిర్లక్ష్యం తీరిది..
» ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది నెల రోజులే. సీజన్‌లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 55.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
» మరొక వైపు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 47 లక్షల ఎకరాలు.
» ఈ రెండు పంటలు కలిపి కోటి ఎకరాలకు పైగా సాగులో ఉంటే. ఇప్పటి వరకు కేవలం 30 లక్షల ఎకరాల్లో పంటలు మాత్రమే నమోదు చేశారు.
» సాగుదారులు దాదాపు 60 లక్షల మందికి పైగా ఉంటే కేవలం 10.05 లక్షల మంది రైతులకు చెందిన పంటలను మాత్రమే నమోదు చేశారు.
» ల్యాండ్ పార్సిల్స్ పరంగా చూస్తే 2.61 కోట్లు ఉండగా, కేవలం 13 శాతం అంటే 25 లక్షల ల్యాండ్ పార్సిల్స్‌లో పంటలను మాత్రమే నమోదు చేశారు.