
నీళ్లల్లో ప్రమాదకర ఈ–కొలి,స్ట్రాన్షియం, ఏరోబిక్ మైక్రోబియల్
సాధారణ స్థాయిలోనే యురేనియం
చెన్నైలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు రూరల్: వరుస మరణాలతో అట్టుడికిన గుంటూరు జిల్లా తురకపాలెంలోని నీటిలో బయలాజికల్ కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. గ్రామంలోని నీటిని ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు రాష్ట్రంలోని పలు పరిశోధన కేంద్రాల్లో పరీక్షించారు. రాష్ట్రంలో జరిపిన పరీక్షల్లో ఎటువంటి హానికర ప్రమాణాలు ఉన్నట్లు తేలలేదు. అయితే చెన్నైలోని పరిశోధనశాలలో చేసిన పరీక్షల్లో గ్రామంలోని జలాల్లో ఈ–కొలి బ్యాక్టీరియా, స్ట్రాన్షియం, ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
గ్రామంలో ఎనిమిది నీటి నమూనాలను కమ్యూనిటీ వాటర్ సోర్సులు, మరణించినవారి ఇళ్ల వద్ద బోరు బావుల నుంచి సేకరించారు. కొన్ని నమూనాల్లో ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్ 4000 సిఎఫ్‌యు/ఎంఎల్ నుంచి 9000 వరకు నమోదైంది. దీంతో భూగర్భ జలాలు కలుషితం అయినట్లు తేలింది. ప్రమాదకరమైన ఈ–కొలి బ్యాక్టీరియా ఎక్కువగా నిల్వ ఉన్న నీరు, మురికిప్రదేశాలు, ఇతర వ్యర్థాలు కలిసిన నీటిలో మాత్రమే పెరుగుతుందని సమాచారం.
గ్రామం సమీపంలో క్వారీలనుంచి వెలువడే వ్యర్థాలు, ప్రమాదకర బ్లాస్టింగ్ వ్యర్థాలు కలిసి క్వారీగుంటల్లో నీరు ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల బ్యాక్టీరియా వృద్ధిచెంది ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాగునీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. లీటరు తాగునీటిలో యురేనియం 30 మైక్రోగ్రాముల వరకు ఉండవచ్చు.
పరమాణుశక్తి నియంత్రణ మండలి అంతర్జాతీయ ప్రమాణాలను బట్టి చూస్తే లీటరుకు 60 మైక్రోగ్రాములు ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక నమూనాలో 11 మైక్రోగాములు, మరోదాన్లో 13 మైక్రోగాములు ఉండగా, మిగిలినవాటిలో మైక్రోగాము కన్నా తక్కువే ఉంది.
సరిపోలని నివేదికలు
గ్రామంలో నలుమూలల నుంచి.. ఎంపీపీ స్కూల్లోని చేతిపంపు నీటిని, కె శివవరప్రసాద్ ఇంటి బోరు నీటిని, దాసరి కోటేశ్వరరావు ఇంటి బోరు నీటిని, ఎ.కోటేశ్వరరావు బోరు ద్వారా విక్రయించే నీటిని సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ నీటి నమూనాల్లో బ్యాక్టీరియా ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదని రాష్ట్రంలోని పరి«శోధన సంస్థల అధికారులు ప్రకటించారు. అయితే.. చెన్నైలో నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఈ–కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
యురేనియంపై ఆందోళన వద్దు
తురకపాలెంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందని చెప్పారు. బయలాజికల్ కాలుష్యం నియంత్రణకు గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం వారం రోజులుగా ఆహార వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. రెండురోజులుగా గ్రామంలో నీటిద్వారా వ్యాపించే వ్యాధులు నమోదు కాలేదని ఆమె తెలిపారు.