ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు

Dwaraka Tirumala Brahmotsavam Dates 2022: Thirukalyanam, Arjitha Sevas - Sakshi

ఈనెల 9న రాత్రి తిరుకల్యాణం

10న రథోత్సవం, ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు  

ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.  


క్షేత్ర చరిత్ర 

ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు.  పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. 


అభివృద్ధి ఘనం 

భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్‌ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్‌డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  


బ్రహ్మోత్సవాలు ఇలా..
 
► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం.

► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం

► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం.

► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం.

► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం.


► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం.

► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం.

► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి .

సేవలు రద్దు 
బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. 


సామాన్య భక్తులకు ప్రాధాన్యం
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం.   
– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top