
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ద్రవిడియన్ యూనివర్సిటీ
ఇలాంటి సమయంలో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో విద్యార్థులు చేరకపోతే పరిస్థితి ఏమిటని వాదన
సౌకర్యాలు లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారంటూ నిలదీత
వర్సిటీపై మరింత భారం తప్పదని హెచ్చరిక
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే చాలా కోర్సులు మూతపడగా.. ఉన్న వాటిలోనూ చేరికలు తగ్గిపోయాయి. ఈ తరుణంలో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది నుంచి సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ–ఎంఎల్) కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్టు వర్సిటీ ప్రచారం చేస్తోంది.
ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ఫీజిబులిటీ రిపోర్టు కూడా సక్రమంగా లేకపోవడం, డీపీఆర్ సైతం నామమాత్రంగా ఉండటంతో అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు సమాచారం. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ వర్సిటీకి ప్రభుత్వం రూపాయి సాయం చేయట్లేదు. ఇలాంటి తరుణంలో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణకు భరోసా ఎక్కడ నుంచి లభిస్తుందో చెప్పలేని దుస్థితి.
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో కోర్సులు అందించినప్పటికీ ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆర్థిక వనరులు తగ్గిపోయి నిర్వహణ ఖర్చు పెరిగిపోతుంది. వర్సిటీని ఆర్థికంగా బలోపేతం చేయకుండా ప్రభుత్వం కొత్తగా కళాశాలలను మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వర్సిటీలు ప్రభుత్వ సెట్స్ ద్వారా కాకుండా సొంత విధానంలో ఇంజినీరింగ్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేసుకోవడం చట్ట విరుద్ధమని విద్యావేత్తలు చెబుతున్నారు.
అయ్యో.. ‘శ్రీనివాస వనం’
ఇన్‌చార్జిల పాలనలో ఆర్థిక అరాచకత్వం, వనరుల విధ్వంసంతో యూనివర్సిటీ ప్రతిష్ట దారుణంగా దిగజారింది. ఇలాంటి సమయంలో వర్సిటీని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడియన్ వర్సిటీ ఉంది. టీటీడీ ప్రోత్సాహంతో వర్సిటీలో శ్రీనివాస వనం పేరుతో దశాబ్దాలుగా చెట్లను పెంచారు. ఇన్‌చార్జి పాలకులు అడ్డగోలు టెండర్లు పిలిచి చెట్లను నిలువునా కొట్టేశారు. సుమారు 100 ఎకరాల్లో చెట్లను నరికేశారు.
దీనిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లగా ఎండిన చెట్లను తొలగించే క్రమంలో కొన్ని పచ్చని చెట్లపై పడటంతో వాటిని తొలగించాల్సి వచ్చిందని సమాధానం ఇవ్వడం.. దానికి సీఎంవో అధికారులు తలూపడంపై కుప్పంలో చర్చ నడుస్తోంది. టన్ను కట్టెలు రూ.5 వేలు ఉంటే.. కేవలం రూ.3 వేలకే విక్రయించినట్టు.. అది కూడా మూడు లోడ్లు సరుకు వెళితే రికార్డుల్లో ఒక్క లోడు మాత్రమే చూపించడం వంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. చెట్లను నేలకూల్చి విక్రయించగా వచ్చిన నగదులో ఈసీ అనుమతి లేకుండా రూ.25 లక్షలు వెచ్చించి రెండు వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఆర్థిక శాఖ జీవో ప్రకారం వర్సిటీ అవసరాలకు కొత్త వాహనాల కొనుగోలు కంటే అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవాలని ఆదేశాలున్నాయి. కానీ, ఆ జీవోలను కాలరాస్తూ ద్రవిడియన్ వర్సిటీ ఇన్‌చార్జి పాలకులు విద్యార్థులకు అత్యవసర సేవల పేరిట వాహనాలు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల విలువ దాటితే తప్పనిసరిగా ఈసీలో అనుమతి తీసుకోవాలి. ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు.