విష వాయువులు పీల్చడంతో స్పృహ కోల్పోయి ఉంటారు
అత్యధిక వేడితో నిమిషాల్లో బొగ్గుగా మారిన శరీరాలు
కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సాయి సుధీర్ వెల్లడి
ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పడిపోయిన వైనం
మొండేల నుంచి డీఎన్‌ఏ టెస్టు కోసం నమూనాలు
48 గంటల్లో నివేదికలు వచ్చే అవకాశం
వాటి ఆధారంగా కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత
కర్నూలు (హాస్పిటల్): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.సాయిసుదీర్ వెల్లడించారు.
కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్‌ఏ పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు.
రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్ సాయిసు«దీర్ శనివారం ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.
ఇదే సమయంలో వారిని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి.
దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహకరించారు.
తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం
పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె.నాగార్జున, డాక్టర్ పి.హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ ఎండి. మహమ్మద్ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం.
మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్‌ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష అనివార్యమైంది.
కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం.


