క్రిస్మస్‌ తర్వాత టిడ్కో ఇళ్ల పంపిణీ

Distribution of Tidco homes after Christmas - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం ఉద్దేశించిన ఈ గృహాలను ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్‌ సెలవులు పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్‌ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, సాధ్యమైనంత వేగంగా వాటిని లబ్ధిదారులకు అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

నెల్లూరు నుంచి శ్రీకారం 
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈసారి 1.18 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత పనులు చేపట్టి 75,784 యూనిట్లను పూర్తి చేశారు. వీటిని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందిస్తారు.  క్రిస్మస్‌ సెలవుల తర్వాత నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

ఆ ఇళ్లకు డిసెంబర్‌ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని టిడ్కో ఎండీ తెలిపారు. కాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెనువెంటనే లబ్ధిదారులకు అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పూర్తయిన నిర్మాణాలకు బ్యాంకు లింకేజీ పూర్తిచేసి వెనువెంటనే రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top