ఎక్సలెన్స్‌ సెంటర్లుగా డైట్‌ కళాశాలలు

Diet colleges to developedas centers of excellence - Sakshi

శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు డైట్‌ కళాశాలలు ఎంపిక

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా శిక్షణ, సదుపాయాల కల్పన

రూ.24 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

వచ్చే ఐదేళ్లలో మరో 10 సెంటర్ల అభివృద్ధి

సాక్షి, అమరావతి: ప్రపంచ అవకాశాలను అందుకునేలా.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసే ఉపా­ధ్యాయులకు ఈ దిశగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొలివిడతగా మూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఎంపిక చేసింది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 125 డైట్‌ కళాశాలలను మోడల్‌ డైట్స్‌ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)గా ఎంపిక చేయగా.. వాటిలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలకు చెందిన మూడు డైట్‌ కళాశాలలకు అవకాశం దక్కింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థులను నూతన విద్యా విధానానికి అనువుగా శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ మూడు సెంటర్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 13 డైట్‌ కాలేజీలు ఉండగా.. మూడు కేంద్రాలకు మోడల్‌ డైట్‌ గుర్తింపు లభించింది. మిగిలిన డైట్‌ కేంద్రాలను 2028 నాటికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నారు. 

ఎన్‌ఈపీకి అనుగుణంగా మార్పు 
జాతీయ విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ) ప్రకారం డైట్‌ కళాశాలల్లో శిక్షణ పొందే ఉపాధ్యాయ విద్యా­ర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇన్‌ సర్వీస్, ఇండక్షన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు విద్యార్థులకు, ఉపా«­ద్యాయులకు విద్యా సంబంధ పరిశోధన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. వృత్తి విద్యా కోర్సులో భాగంగా పారిశ్రామిక భాగస్వాములతో సమన్వ­యం చేసుకుంటూ వృత్తి నైపుణ్యాలను మెరుగుప­రచడం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందుకు అవసరమైన సదుపాయాలను మోడల్‌ డైట్స్‌లో కల్పిస్తారు.

ఎక్సలెన్స్‌ సెంటర్లుగా ఎంపికైన డైట్స్‌లో పూర్తి మౌలిక సదుపాయాలు, స్మార్ట్‌ తరగతి గదులు, ఐసీటీ ల్యాబ్‌ (కంప్యూటర్‌ ల్యాబ్స్‌), ప్రయోగశా­లలు, భద్రత కోసం సీసీ కెమెరాలు, ప్రహరీ, ప్రథమ చికిత్స కిట్స్, స్టాఫ్‌ క్వార్టర్స్‌ (సిబ్బందికి వసతి), ఫర్నిచర్, కిచెన్‌ గార్డెన్, సోలార్‌ ప్యానల్స్, క్రీడా సౌకర్యాలు, విద్యార్థులకు వసతి గృహాలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో తీర్చిదిద్దుతారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో 13 డైట్‌ సెంటర్లు ఉన్నాయని, వాటిలో ఈ ఏడాది మూడు సెంటర్లను కేంద్ర ప్రభుత్వం మోడల్‌ డైట్స్‌గా ఎంపిక చేసి  24 కోట్ల రూపాయలు  మంజూరు చేసిందని సమగ్రశిక్ష ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో వీటిలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. మిగిలిన 10 డైట్‌ కళాశాలలను 2028 సంవత్సరం నాటికి ఎక్సలెన్స్‌ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top