దేశంలో మెడికల్‌ టూరిజం అభివృద్ధి | Development of medical tourism in country | Sakshi
Sakshi News home page

దేశంలో మెడికల్‌ టూరిజం అభివృద్ధి

Jun 12 2022 4:52 AM | Updated on Jun 12 2022 2:43 PM

Development of medical tourism in country - Sakshi

ఎయిమ్స్‌లోని క్లినికల్‌ లేబొరేటరీని పరిశీలిస్తున్న కేంద్ర సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌

సాక్షి, అమరావతి/మంగళగిరి: భారతదేశ వైద్య విధానం పూర్తిగా మారుతోందని, పలు మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ అన్నారు. మన ప్రాచీన వైద్య విధానానికి ఎంతో విలువ ఉందని, దేశంలో మెడికల్‌ టూరిజంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో శనివారం జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్‌భవ విభాగాల అధికారులతో కేంద్రమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం కమిషనర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ త్రిపాఠి, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ హైమావతి, ఆయా విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా మన దేశ ప్రజలకు వైద్యం అందించామని.. ప్రజల వైద్యం కోసం కేంద్రం రూ.వేల కోట్లను ఖర్చుచేసిందన్నారు. 

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ 
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా వైద్య రంగంలో సంచలనాలకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెరతీశారని, ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు వంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వైద్యాన్ని పేదల చెంతకు చేర్చిన తొలినేతగా ఆయన నిలిచారన్నారు.

ఇప్పుడు ఆయన కుమారుడు, సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని వైద్య విధానాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దారని వివరించారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే ఆయుష్మాన్‌ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఒక్క ఆరోగ్యశ్రీ పథకం కిందే తమ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు రజని చెప్పారు.  
ఎయిమ్స్‌ సందర్శన.. సేవలపై అసంతృప్తి
ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లో ఇప్పటికే ఔట్‌ పేషెంట్‌ విభాగం పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందిస్తోందన్నారు. త్వరలోనే ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయని, వచ్చే జూలై నుంచి పీజీ కోర్సులతోపాటు నర్సింగ్‌ కోర్సులు నిర్వహిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement