‘పాఠశాల విద్య’ ఆస్తుల 'రీ సర్వే'

Department of Education has already issued directives to DEOs and RJDs - Sakshi

మొత్తం భూములు, స్థలాలెన్ని.. ఆక్రమణలో ఎన్ని అంశాలపై అధ్యయనం

డ్రోన్‌ రోవర్స్‌ ఇతర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం 

సీవోఆర్‌ఎస్‌ ద్వారా ఇక నిరంతర పర్యవేక్షణ 

వీటన్నింటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ  

డీఈవోలు, ఆర్జేడీలకు విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తమ అదీనంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు.. వివిధ కార్యాలయాలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల పరిరక్షణకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ శాఖతో పాటు వివిధ విభాగాల పరిధిలో మొత్తం 42,069 స్కూళ్లు, గురుకుల సంస్థలు, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున భూములు, స్థలాలు, భవనాలు, ఇతర పరికరాలతోపాటు కాలక్రమంలో అనేక సదుపాయాలు సమకూర్చింది. ప్రభుత్వంతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రభుత్వ స్కూళ్లు, విద్యాసంస్థలకు భూములు, స్థలాలు, ఇతర వస్తువులను అందించారు. అయితే, ఇప్పటివరకు వీటికి సంబంధించి సరైన నిర్వహణ లేకుండాపోయింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు, ఇతర పత్రాలు కనిపించని పరిస్థితి. పలుచోట్ల భూములు, స్థలాలు కూడా అన్యాక్రాంతమయ్యాయి. పరికరాలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంకొన్నిచోట్ల.. కంచే చేను మేసిందన్నట్లు ఆయా గ్రామాలకు చెందిన నేతలు, స్కూళ్ల సిబ్బంది ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 

గత ప్రభుత్వాల పరిరక్షణ లేకే.. 
ఈ విద్యా సంస్థలకు సంబంధించిన భూములు, స్థలాల విలువ ఏటేటా పెరిగిపోతుండడంతో అనేకచోట్ల అక్రమార్కులు వాటి రికార్డులు తారుమారు చేసి వాటిని కబ్జాచేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాలూ ఏర్పాటుచేసుకున్నారు. ఇవేకాక.. స్కూళ్లకు కొన్నేళ్లుగా వివిధ పథకాల కింద ప్రభుత్వాలు లక్షలాది రూపాయల విలువ చేసే కంప్యూటర్లు, టీవీలు, ఫర్నీచర్, ఇతర పరికరాలను అందించినా వాటిలో చాలా శాతం ఇప్పుడు కనిపించవు. కొన్నేళ్ల క్రితం వరకు వాచ్‌మెన్లు ఉండేవారు. కాలక్రమంలో ఆ పోస్టుల భర్తీ లేకపోవడంతో కొన్నేళ్లుగా స్కూళ్లకు భద్రత లేకుండాపోయింది. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలతో సమకూర్చిన పరికరాలకు రక్షణ కరువైంది. గత ప్రభుత్వాలు కూడా ఈ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులు, ఇతర అంశాలను పూర్తిగా విస్మరించాయి. 

రీసర్వేకు ఏర్పాట్లు 
ప్రభుత్వ స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు, కార్యాలయాల భూములు, స్థలాల రీసర్వేకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు, ఆర్జేడీలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో వారంతా తమ పరిధిలోని స్కూళ్లు, మండల రిసోర్సు సెంటర్లు, భవిత కేంద్రాలు, జిల్లా ఎలిమెంటరీ విద్యాబోధనా శిక్షణ సంస్థలు (డైట్స్‌) ఇతర కార్యాలయాలు, సంస్థల భూములు, స్థలాల రీసర్వేకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ ఆస్తుల సరిహద్దులను డీమార్కింగ్‌ చేసి వాటికి సరైన రికార్డులను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం డ్రోన్‌ రోవర్స్‌ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా ఆదేశాలిచ్చారు. ఇకపై ఈ ఆస్తులకు సంబంధించి ‘కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్సు స్టేషన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top