కరోనాతో కరెంటుకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

కరోనాతో కరెంటుకు డిమాండ్‌

Published Wed, Apr 28 2021 4:27 AM

Demand for electricity with Corona - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. రోజూ 228 మిలియన్‌ యూనిట్‌ (ఎంయూ)ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటోంది. సగటు విద్యుత్‌ వినియోగం 160 ఎంయూలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, కోవిడ్‌ ప్రభావం దీనికి కారణమని విద్యుత్‌ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న నేపథ్యంలో వినియోగం ఎక్కువవుతోంది. మే మొదటి వారానికి డిమాండ్‌ రోజుకు 235 ఎంయూలు దాటొచ్చని భావిస్తున్నారు. ఆ డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ఆ రెండు నగరాలే కీలకం!
విజయవాడ, గుంటూరు నగరాలు, సీఆర్‌డీఏ పరిధిలో 2019 ఏప్రిల్‌లో 267.53 ఎంయూల విద్యుత్‌ డిమాండ్‌ రికార్డయితే.. 2020 ఏప్రిల్‌లో ఇది 388.38 ఎంయూలకు చేరింది. 2021 మేలో ఇది 450 ఎంయూలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్‌ కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆస్పత్రులకే వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ విద్యుత్‌ వినియోగం అనివార్యమవుతోంది. అన్నిచోట్ల 24 గంటలూ ఏసీలు వినియోగిస్తున్నారు. పగటి వేళల్లో డిమాండ్‌ పెరిగి విద్యుత్‌ లోడ్‌ అత్యధికంగా ఉంటోంది. దీనికితోడు కార్యాలయాల సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ప్రజలూ ఇల్లు దాటడం లేదు. ఫలితంగా గృహవిద్యుత్‌ వినియోగం 2019 కన్నా 20 శాతం ఎక్కువగా ఉందని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. 

విద్యుత్‌ అంతరాయాల్లేకుండా ఏర్పాట్లు
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విద్యుత్‌ అంతరాయాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కోవిడ్‌ సెంటర్లు, ఆస్పత్రులకు విద్యుత్‌ అంతరాయాలు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాం. అవసరమైతే మార్కెట్లో విద్యుత్‌ కొంటాం. ఎట్టి పరిస్థితుల్లోను వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీచేశాం.     
– శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి 

ఆ రెండు నగరాలపై దృష్టి
విజయవాడ, గుంటూరు నగరాల్లో వైద్యసేవలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది నిరంతర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఉన్నతస్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జోన్ల వారీగా పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశాం. లోడ్‌ పెరిగినా విద్యుత్‌ సరఫరాకు ఆటకం రావడం లేదు. మేలో మరింత అప్రమత్తంగా ఉంటాం. 
– పద్మా జనార్దన్‌రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement