తగ్గుతున్న పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం | Declining consumption of petroleum products | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం

Jul 3 2026 4:44 AM | Updated on Jul 3 2026 4:44 AM

Declining consumption of petroleum products

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఈవీల వినియోగం పెరిగింది

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈవీల వాటాలో భారీ పెరుగుదల

రాష్ట్రంలో ఈవీల వాటా 2024లో 1.6 శాతం.. ఈ ఏడాది ఇప్పటికే 8.9 శాతం

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్‌ వాహనాల (ఈవీల) వినియోగం పెరుగుతోంది. పశ్చిమాసియా సంక్షోభం భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలను మారుస్తోందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఈవీల వినియోగం బాగా పెరిగిందని, ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్‌ వాహనాల వినియోగ వాటా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 

దేశంలో 2024లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 2 శాతమే ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8 శాతానికి పెరిగింది. 2030 నాటికి 20 శాతం వాటాను సాధించడం ద్వారా దిగుమతి బిల్లులో రూ.1 లక్ష కోట్లు ఆదా చేయవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. ఫిబ్రవరి నుంచి అన్ని రాష్ట్రాల్లోను ఈవీల వినియోగం భారీగా పెరిగిందని తెలిపింది. మన రాష్ట్రంలో 2024లో ఈవీల వాటా 1.6 శాతం ఉండగా ఈ ఏడాది ఇప్పటికే 8.9 శాతానికి పెరిగింది. 

రాష్ట్రంలో 2024లో ఈవీ రిజిస్ట్రేషన్లు 14,605 ఉండగా 2025లో 48,935కు పెరిగాయి. 2026లో ఇప్పటికే 47,066 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈవీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. 2025లో సగటున నెలకు 1.3 లక్షల ఈవీ   రిజిస్ట్రేషన్లు జరగగా.. 2026 మార్చి నుంచి జూన్‌ మధ్య సగటున నెలకు 2.3 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2025 సగటుతో పోలిస్తే ఈ రిజిస్ట్రేషన్లు లక్ష ఎక్కువ. ప్రస్తుత నమోదు ప్రకారం 2026 నాటికి మొత్తం ఈవీల రిజిస్ట్రేషన్లు 25 లక్షల మార్కు దాటవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement