
పెనమలూరు(కృష్ణా జిల్లా): ఆప్యాయత, అనురాగాలతో అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణించడంతో కుమార్తెలే కుమారులై అంత్యక్రియలు జరిపించి రుణం తీర్చుకున్న ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో చోటుచేసుకుంది. పోరంకికి చెందిన కొడాలి వెంకటరత్నం (68)కి భార్య అరుణ కుమారి, కుమార్తెలు సంతోషి శ్రీదేవి ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
అనారోగ్యం కారణంగా వెంకటరత్నం ఈనెల 11న మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న కుమార్తెలు అమెరికా నుంచి మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. వెంకటరత్నంకు కుమారులు లేకపోవటంతో అక్కాచెల్లెళ్లిద్దరూ శ్మశాన వాటికకు వెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. పెద్ద కుమార్తె సంతోషి తండ్రి చితికి నిప్పంటించింది. వెంకటరత్నం కుమార్తెలిద్దరినీ గ్రామస్తులు అభినందించారు.
కౌలు రైతు బలవన్మరణం
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): వ్యవసాయం కలిసిరాక...సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనో వేదనకు గురై ఓ కౌలురైతు బలవన్మరణం పొందిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆళ్ల ఆదినారాయణ(45) తనకున్న అర ఎకరంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో మిర్చి, ఎకరం పాతికలో పసుపు, ఎకరంలో మొక్కజొన్న, మిగిలిన దాంట్లో వరి సాగు చేశాడు. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు.
మిరప, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆశించిన దిగుబడి రాకపోగా, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక మదనపడ్డాడు. ఏమి చేయాలో పాలు పోక సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోవటంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.