దుస్తులు చింపేసి.. కులం పేరుతో దూషించి దాడి
పిఠాపురం నియోజకవర్గ పరిధి తాటిపర్తిలో ఘటన
గొల్లప్రోలు (పిఠాపురం): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రాజకీయ అండదండలతో ఒక దళిత మహిళపై జనసేన నేత అమానుష ఘటనకు పాల్పడ్డారు. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఐ.సుబ్రహ్మణ్యం, అతని అనుచరులు ఒక ఎస్సీ మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరుతో దూషించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన కందేటి ప్రమీలరాణి అనే మహిళ భర్త సతీష్ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లు చేస్తుంటారు. తాటిపర్తిలో ఇటీవల ఒక ఇల్లు నిర్మాణం చేశారు. అందుకు సంబంధించిన డబ్బు విషయంలో ఇంటి యజమానికి, కాంట్రాక్టర్‌కు వివాదం తలెత్తడంతో సెటిల్‌మెంట్ చేసుకోవడానికి శుక్రవారం ప్రమీలారాణి, ఆమె భర్త తాటిపర్తి వచ్చారు.
ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం, గోవిందరాజు, సత్యనారాయణ మరో ఇద్దరు జనసేన నాయకులతో కలిసి డబ్బు విషయం తేల్చకుండా వివాదాస్పదంగా మాట్లాడుతుండటంతో భద్రత కోసం తాను సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా తనపై దాడికి దిగారని బాధితురాలు ప్రమీలరాణి ఆరోపించారు. తాను వీడియో తీస్తుండగా తనపై దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. సుబ్రహ్మణ్యం, అతని అనుచరులైన గోవిందరాజు, సత్యనారాయణ తనపై విరుచుకుపడ్డారని, తన చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించి తనను కిందకు తోసేశారని బాధితురాలి వివరించింది.
అందరూ చూస్తుండగానే తన ఒంటిపై దుస్తులు చింపి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని తెలిపింది. కులం పేరుతో దూషిస్తూ ‘నీ బతుకెంత? నీ జాతి ఎంత?‘ అంటూ అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులకు ఇచ్చి న ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ తీవ్రంగా హింసించినట్లు తెలిపింది. ‘నా వెనుక పార్టీ ఉంది. నా దగ్గర డబ్బు ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు‘ అంటూ నిందితుడు సుబ్రహ్మణ్యం తనను బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది.

ఈ అమానుష ఘటనపై బాధితురాలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు.


