డిమాండ్‌కు తగ్గట్లు కరెంట్‌ కొనుగోళ్లు  | Sakshi
Sakshi News home page

డిమాండ్‌కు తగ్గట్లు కరెంట్‌ కొనుగోళ్లు 

Published Thu, Apr 11 2024 5:09 AM

Current purchases fall short of demand - Sakshi

ఏపీ అభివృద్ధికి సూచికగా పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్‌తో పాటు మార్కెట్‌లోనూ కొనుగోలు  

రోజూ 30.21 మిలియన్‌ యూనిట్ల కోసం రూ. 20.63 కోట్ల వ్యయం 

చంద్రబాబు హయాంలో కాలంతో సంబంధం లేకుండా కరెంటు తిప్పలు 

జగన్‌ ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలతో ప్రజలకు తప్పిన విద్యుత్‌ కోతలు 

సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్‌ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్‌ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది.

ఇలా ఏ ఏటికాయేడు కింద­టి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ వి­ద్యు­త్‌ డిమాండ్‌ 236.73 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్‌ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్‌ డిమాండ్‌ 11,926 మెగావాట్లుగా ఉంది.

గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాక­ముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. 

కొనుగోలుకు వెనుకాడకుండా.. 
రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్‌కో థర్మల్‌ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్‌కో హైడల్‌ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్‌కో సోలార్‌ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్‌ జెనరేటింగ్‌ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్‌ వంటి ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్‌ నుంచి 21.635 మి.యూ, విండ్‌ నుంచి 20.535 మిలియన్‌ యూనిట్లు చొప్పున సమకూరుతోంది.

నెల రోజుల్లో పవన విద్యుత్‌ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్‌ నుంచి యూనిట్‌ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్‌ ఫోర్‌కాస్ట్‌ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్‌ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్‌టెర్మ్‌ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కోసం ముందస్తు బిడ్‌లు దాఖలు చేస్తున్నాయి.

తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్‌ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్‌ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్‌ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్‌ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. 

Advertisement
Advertisement