
మృతుడిది శ్రీసత్యసాయి జిల్లా
ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఘటన
కనగానపల్లి: ఆర్థిక సమస్యలు తాళలేక శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను కంచుకుంట మురళి (30) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సొంతూరు కనగానపల్లి మండలంలోని శివపురం కొట్టాల. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శివపురం కొట్టాల గ్రామానికి చెందిన బోయ ముత్యాలప్ప కుమారుడు కంచుకుంట మురళి సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఏడేళ్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మురళి తల్లిదండ్రులు నాగలక్ష్మి, ముత్యాలప్ప వ్యవసాయ కూలీలు.
ఇంటర్ వరకు చదువుకున్న మురళి సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. ఐదేళ్ల క్రితం అనంతపురానికి చెందిన పావనిని వివాహం చేసుకోగా.. వీరికి నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. తండ్రి ముత్యాలప్పకు స్కిన్ క్యాన్సర్ రావడంతో వైద్యం కోసం రూ.30 లక్షల దాకా ఖర్చు చేశాడు. అయినా తండ్రి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దీనికి తోడు చెల్లికి వివాహం చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే ఏడాది క్రితం పెనుకొండ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మురళి కారు కింద పడి దంపతులు మృతి చెందారు.
దీంతో మృతుల కుటుంబానికి పరిహారం చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మురళి ఆదివారం రాత్రి అనంతపురంలోని పుట్టింట్లో ఉంటున్న తన భార్య పావనికి ఫోన్ చేసి కుటుంబ సమస్యలపై కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత కాసేపటికే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఆర్‌పీఎఫ్ అధికారులు చెప్పారు. మురళి మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.