ప్యారెట్స్‌..పేరెంట్స్‌.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తున్న దంపతులు..

Couple Feeding 650 Parrots For Five Years In AP Eluru Kaikaluru - Sakshi

సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్‌ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు.

కైకలూరులోని వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్‌ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్‌ నగర్‌లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు.

చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు.

చిలుకలను దేవతలుగా భావిస్తాం
అరుణాచలం దేవాల­యా­నికి వెళ్లినప్పుడు రెండు చి­లుకలు మా తలలపై తిరి­గాయి. మా మామ మర­ణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటన­లతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.
– కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు
చదవండి: లేటు వయసులోనూ నీట్‌ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top