ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! 

Corruption Allegations On Sub Inspector - Sakshi

పెనుకొండ ప్రాంతంలో  వివాదాస్పద ఎస్‌ఐ

అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్ను

గతంలో చిలమత్తూరులోనూ మద్యం దళారులతో దందా

అండగా నిలిచిన అప్పటి సీఐ

అనధికార డ్రైవర్‌ మధ్యవర్తిగా అక్రమార్జన 

ఆయనో ఎస్‌ఐ. శాంతిభద్రతలు కాపాడటంతో పాటు అక్రమ మద్యం, పేకాట, మట్కా తదితరాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారి. అలాంటి బాధ్యతాయుతమైన అధికారి దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం పెనుకొండ ప్రాంతంలో పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సారు.. గతంలో చిలమత్తూరులోనూ పనిచేశారు. ఆ సమయంలో అక్కడా అక్రమ మద్యం ఏరులై పారించారు. అప్పటి సీఐ అండతో ఆయన రెండు చేతులా ఆర్జించారనే అపవాదు ఉంది. ఈయన దందా బయటపడినా అదే సీఐ అండతో ఎస్పీకే టోకరా వేసినట్లు సమాచారం.

రెండు రోజుల కిందట పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందనే సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందింది.   పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అధికారులు.. అక్కడి పరిస్థితులతో విసిగిపోయి సోమందేపల్లి ఎస్‌ఐ వెంకటరమణకు విషయం చేరవేశారు. సదరు ఎస్‌ఐ వెంటనే సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి, నిందితులను అరెస్ట్‌ చేశారు. వాస్తవానికి శెట్టిపల్లిలో జరుగుతున్న పేకాట గురించి ముందుగానే పెనుకొండ ప్రాంతంలోని పోలీసు అధికారికి తెలిసినా ఆయనెందుకనో మౌనం వహించారు. ఈ చిన్న సారు పనితీరుకు ఇదో ఉదాహరణ మాత్రమే.. ఆయన పనిచేసిన చోటల్లా ఇదే తంతు. 

హిందూపురం సెంట్రల్‌: పెనుకొండ ప్రాంతంలో పని చేస్తున్న ఓ ఎస్‌ఐ పనితీరు వివాదాస్పదంగా మారింది. మట్కా నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. దుప్పటి పంచాయితీలు చేసి డబ్బులు దండుకోవడం. చేయి తడిపితే చాలు కేసును తారుమారు చేయడం.. తనమాట వినకపోతే బెదిరింపులతో పాటు గుండాగిరీ చేయడం ఆయన నైజం. ఇలా ఖాకీ దుస్తుల్లో పోలీసు శాఖ పరువు తీస్తున్న ఆయన వైఖరిపై నిజాయితీ ముసుగులో ఖాకీ దందా శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో గతంలో ఆయన పనిచేసిన చిలమత్తూరు స్టేషన్‌ సిబ్బందీ ఆయన కన్నింగ్‌ కథలు  ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటున్నారు.

అక్రమ మద్యం.. ఆయన కనుసన్నల్లోనే 
పెనుకొండకు రాకముందు చిలమత్తూరులో పనిచేసిన ఈ చిన్న సారు.. బార్డర్‌లో అక్రమ మద్యం దందా జోరుగా సాగించారు. కొడికొండ చెక్‌పోస్ట్‌లో గతేడాది కరోనా లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి ఏరులై పారింది. అందుకు అప్పటి చిలమత్తూరు స్టేషన్‌లోని ముఖ్య అధికారే సహకరించారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. చిలమత్తూరు మండలంలోని కొందరి వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో రూ.లక్షలు దండుకున్నారని తెలుస్తోంది.

అనధికార డ్రైవర్‌తో దందా 
అనధికారికంగా నియమించుకున్న డ్రైవర్‌ సాయంతో సదరు ఎస్‌ఐ రూ.లక్షలు కూడబెట్టినట్టు అప్పట్లో చిలమత్తూరు మండలంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే చిలమత్తూరు ఎస్‌ఐగా రంగడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్‌ఐ రంగడు కొడికొండ చెక్‌పోస్ట్‌కు వెళ్లగా.. సాయంత్రం సమయంలో సర్వీస్‌ రోడ్‌లో ఓ కారు వచ్చింది. దీంతో ఎస్‌ఐ ఆ కారును నిలుపగా... అందులోని వ్యక్తులు కారును వదిలేసి పారిపోయారు. అందులో చిలమత్తూరు మండలానికి చెందిన వ్యక్తులతో పాటుగా అంతకుముందు చిలమత్తూరు ఎస్‌ఐకి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఉన్నట్లు తేలింది. దీనిపై అప్పుడే ‘సాక్షి’ చిల‘మత్తూరు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీన్ని ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్‌గా తీసుకోగా.. ఎస్పీని తప్పుదోవ పట్టిస్తూ సీసీటీవీ పుటేజీల మాయాజాలంతో అప్పటి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మభ్యపెట్టారు. చిలమత్తూరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చూపించి కేసును సింపుల్‌గా మూసేశారు.

స్వామి భక్తికి మెచ్చి డ్రైవర్‌కు ప్రమోషన్‌  
కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో ఉన్నతాధికారులకు సహకరించిన సదరు ఎస్‌ఐ డ్రైవర్‌కు సర్కిల్‌స్థాయి అధికారి ప్రమోషన్‌ ఇప్పించి ఏకంగా ఎస్పీఓగా తీసుకున్నారు. ఆధారాలు తారుమారు చేసిన తర్వాత తమను ఎవరు ఏమి చెయ్యగలరనే ధైర్యంతో ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

పెనుకొండ వ్యవహారంపై తీవ్ర చర్చ 
ఇక పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త పెనుకొండ పోలీసు సబ్‌ డివిజన్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఆ ఎస్‌ఐ ఎక్కడికి వెళ్లినా ఇంతేనా అంటూ పోలీసులే పెదవి విరుస్తున్నారు.

చదవండి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ   
ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top