
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు ఇవి అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాడ్పులు విజృంభిస్తుంటే మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. సాధారణంగా అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతో ‘నైరుతి’ ఆగమన ప్రక్రియ ఆరంభమవుతుంది. అక్కడ నుంచి బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి పది రోజుల్లో జూన్ ఒకటో తేదీ నాటికి కేరళను తాకుతాయి.
అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి నిర్ణీత సమయానికి రెండ్రోజుల ముందే అంటే మే 18 నాటికే రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి అవి బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు చాలా నెమ్మదిగా విస్తరించాయి. దీంతో ఈ రుతుపవనాలు కేరళలోకి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న ప్రవేశించాయి.
ఆ తర్వాత కూడా అవి ఆశించినంతగా చురుకుదనాన్ని సంతరించుకోలేదు. ఫలితంగా వర్షాలు కురవడం లేదు. పైగా రోహిణీకార్తె వెళ్లి మృగశిర కార్తె ప్రవేశించినా ఇంకా రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే (42–45 డిగ్రీల వరకు) నమోదవుతున్నాయి. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఈనెల 18 వరకు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆ రెండు తుపానుల వల్లే..
రుతుపవనాల ప్రవేశానికే కాదు.. వాటి విస్తరణలో ఆలస్యానికి ఇటీవల సంభవించిన తుపానులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అనంతరం అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్ వైపు పయనించి తీరాన్ని దాటింది. దీంతో బంగాళాఖాతంలోని తేమను ఈ తుపాను అటు వైపు లాక్కుని పోయింది. దీంతో రుతుపవనాలు బంగాళాఖాతంలోకి వేగంగా విస్తరించకుండా, ఆపై కేరళలోకి సకాలంలో ప్రవేశించకుండా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 8న నైరుతి రుతుపవనాలు కేరళను తాకినా ఆ తర్వాత కూడా మందగమనమే కొనసాగుతోంది.
తాజాగా అరేబియా సముద్రంలో ఈనెల 6న ‘బిపర్‌జోయ్’ తుపాను సంభవించింది. ఈ తుపాను కూడా అత్యంత తీవ్ర తుపానుగా బలపడి గుజరాత్ వైపు పయనిస్తోంది. ఈ తుపాను కూడా ‘మోకా’ మాదిరిగానే నైరుతి రుతుపవనాల వేగానికి కళ్లెం వేసింది. అరేబియా సముద్రంలోని తేమను తుపాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోవడంతో రుతుపవనాలు ఆశించినంతగా విస్తరించడం లేదు.. వర్షించడం లేదు. వాస్తవానికి సాధారణ పరిస్థితులుంటే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది.
అయితే ఇప్పటికీ రాయలసీమలో ఒకట్రెండు చోట్ల అరకొరగా మినహా రాష్ట్రంలో ఎక్కడా రుతుపవనాల వర్షాలు కురవడం లేదు. ఇంకా రాష్ట్రంలో ఎక్కడైనా అడపా దడపా వానలు కురుస్తుండడానికి రుతుపవనాల ఆగమనానికి ముందస్తుగా ఏర్పడే థండర్ స్టార్మ్ (ఉరుములు, మెరుపులు, పిడుగులు ఈదురుగాలులతో కూడిన వాతావరణం) పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 18 తర్వాతే రాష్ట్రంలో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.
మందకొడిగా నైరుతి రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా మందకొడిగా కదులుతున్నాయి. ఈ నెల 11వ తేదీన అవి శ్రీహరికోట వద్ద రాయలసీమను తాకినా ఆ తర్వాత పెద్దగా ముందుకు కదల్లేదు. ఈపాటికి రాయలసీమలోని అన్ని జిల్లాలకు విస్తరించి తెలంగాణ, కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించాల్సివుంది. కానీ మంగళవారం నాటికి ఇంకా రాయలసీమలోనే పూర్తిగా విస్తరించలేదు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు కొద్దిమేర విస్తరించినా అక్కడ పెద్దగా వర్షాలు కూడా పడడంలేదు.
ఈ నెల 16 వరకు రుతుపవనాలు ఇలా నెమ్మదిగానే కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖాదికారులు తెలిపారు. బిపర్‌జోయ్ తుపాను ప్రభావం 16వ తేదీ నుంచి తగ్గే అవకాశం ఉండడంతో ఆ తర్వాత రుతుపవనాల గమనంలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. 20 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటి నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నా అది నామమాత్రంగానే ఉంది.