
విజయవాడలో ధర్నా చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (ఫైల్)
సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసిన హెల్త్ ఆఫీసర్లు
డిమాండ్‌లపై చర్చిస్తాం.. సమ్మె విరమించాలని అప్పట్లో ప్రభుత్వ హామీ
సమ్మె విరమించి నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొహం చాటేసింది. పల్లె వైద్యం బలోపేతం చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా అప్పట్లో నియమించారు. వీరంతా సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. గ్రామీణ వైద్యం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో చర్చలు జరిపిన ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించారు.
స్పందన ఏదీ!?
ఉన్నతాధికారులు మాటివ్వడంతో వీరంతా సమ్మె విరమించి విధుల్లో చేరారు. సమ్మె విరమించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో హెల్త్ ఆఫీసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైద్యశాఖ మంత్రితో సమావేశం కోసం కోరగా, నాడు హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరు సమ్మెలో ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఆరు నెలల ఇన్సెంటివ్ బకాయిలు రూ.77.33 కోట్లు విడుదలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ ఏడాది మే 8న ప్రొసీడింగ్స్ ఇచ్చినా నిధులు మాత్రం జమ చేయడం లేదు.
మృతుల కుటుంబాలకు భరోసా లేదు
సర్వీస్‌లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస భరోసా కూడా లభించడం లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వీరందరికీ ఈపీఎఫ్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఏడాది నుంచి ఈ సౌకర్యాన్ని వైద్య శాఖ నిలిపేసింది. వీరి సమ్మె డిమాండ్స్‌లో ఈపీఎఫ్ పునరుద్ధరణ కూడా ఒకటిగా ఉంది. సాధారణంగా ఈపీఎఫ్ వాటాదారు మృతి చెందితే ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు బాధిత కుటుంబాలకు సాయం అందుతుంది.
ఈపీఎఫ్ సౌకర్యం పూర్తిగా నిలిపేయడంతో ఆ భరోసా కూడా కరువైంది. ఏఎస్‌ఆర్ జిల్లా లోతుగెడ్డ పీహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గసాడి రమ్యశ్రీ ఈ ఏడాది ఏప్రిల్ 13న మృతి చెందారు. విలేజ్ క్లినిక్ పరిధిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)–3.0 సర్వే నిర్వహిస్తున్న సమయంలో రమ్యశ్రీని కుక్క కరిచింది. రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడింది. ఇలా ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా సర్వీస్‌లో ఉండగానే ఏడుగురు మృతి చెందినట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని వెల్లడించారు.