చిత్తూరు జిల్లా: మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరు అటవీ ప్రాంతంలో మూలికల కోసం వెళ్లిన ఇద్దరికి బంగారు లభ్యమైందని పుకార్లు షికారు చేశాయి. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఎస్‌ఐ నాగేశ్వరరావు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. కోటూరుకు చెందిన గొర్రెల కాపరులైన ఉగిని చానుల్లా, అగ్రహారం మునస్వామి రెండు రోజుల క్రితం జీవాలకు మూలికల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.
అక్కడ వారికి కాలికి తగిలిన చిన్నపాటి కుండను గుర్తించి వెలికితీశారు. అందులో మెరిసే అర్ద చంద్రాకారంలో ఉన్న రేకు దొరికింది. మునస్వామి వాటా అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం పెద్ద మనుషులకు తెలిసింది. ఆనోటా ఈనోటా పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఎస్‌ఐ నాగేశ్వరరావు శుక్రవారం చానుల్లా, మునస్వామి ని స్టేçషన్‌కు పిలిచి విచారించారు. అక్కడ లభించిన రేకును పరిశీలించి చిత్ర పటాలకు వాడే రేకుగా నిర్ధారించారు.


