
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి ఎవరనేది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డంపింగ్ యార్డ్‌పై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. 2015 నుంచి పలు దఫాలుగా పర్యావరణ ఉల్లంఘనలపై కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ తెలిపారు. 2016లో అదనపు భూసేకరణ జరిపి పర్యావరణ అనుమతులు లేకుండా, డంపింగ్ వల్ల తలెత్తే ప్రభావాల్ని అధ్యయనం చేయకుండా ప్రాజెక్టు వ్యర్థాలను డంపింగ్ చేయడం ప్రారంభించారని తెలిపారు.
అనాలోచిత డంపింగ్ వల్ల 2018, 2019 ఫిబ్రవరిలో భూప్రకంపనలు రావడంతోపాటు ప్రాజెక్టు సమీపంలో రహదారులు పగుళ్లు వచ్చాయని తెలిపారు. కాఫర్ డ్యాం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎగువ ప్రాంతాలు భారీగా మునిగి ప్రజలు నష్టపోయారని తెలిపారు. కమిటీలు పలు సూచనలు చేసినా అమలు చేయలేదన్నారు. పర్యావరణ ఉల్లంఘనలపై కేసు వేసినందుకు పిటిషనర్, కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పర్యావరణ ప్రభావంపై ప్రాజెక్టు నిర్మాణ తొలి దశ నుంచే అంచనా చేయాలి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యాక కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు పరిహారం అందజేయాలని ధర్మాసనం పేర్కొంది.
ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తర్వాత బాధ్యత ఇతరులపై వేయడం సరికాదని విషయ నిపుణుడు నాగిన్‌నందా వ్యాఖ్యానించారు. పర్యావరణ పర్యవేక్షణ కమిటీలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ రీసెర్చ్ సహా పలువురు నిపుణులు ఉంటారని ధర్మాసనం పేర్కొంది. కమిటీకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. పూర్తి లిఖిత పూర్వక ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయి.