వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు
సిలిండర్ ధర రూ.3,315కు చేరిక
ఈ నేపథ్యంలో మెనూ రేట్లలో 10 శాతం పెంపు
ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రకటన
సాక్షి, అమరావతి : వాణిజ్య సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా రూ.993 పెరిగింది. గడిచిన 22 నెలల్లో ఈ గ్యాస్ ధర మూడుసార్లు పెరిగినట్లయింది. తాజా పెరుగుదలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.3,315 పలుకుతోంది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెంపుతో హోటల్ రంగం కుదేలయ్యిందని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితులతో హోటళ్ల యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
హోటల్ వ్యవస్థను కాపాడుకోవడానికి మెనూ ధరల్లో 10 శాతం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పన్ను రాయితీలు, సబ్సిడీలిచ్చి హోటల్ రంగాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడటానికి, హోటళ్లను ఆర్థిక నష్టాల నుంచి బయటపడేయటానికి గత్యంతరంలేని పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామన్నారు. వంట నూనెలు, నిత్యావసరాలు, ప్యాకింగ్ మెటీరియల్ ఖర్చులు భారీగా పెరిగాయన్నారు.


