ఆ చిన్నారులకు ప్రభుత్వం బాసట 

CM YS Jagan Response on Loan App Suicide Victims family - Sakshi

దంపతుల ఆత్మహత్య ఘటనపై సీరియస్‌  

తక్షణమే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేత 

లోన్‌ యాప్‌ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం 

రాజమహేంద్రవరం సిటీ/కంబాలచెరువు : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతుల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వేధింపులు, ఒత్తిళ్లకు గురిచేసి.. దంపతుల ప్రాణాలను బలిగొన్న లోన్‌ యాప్‌ బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. తల్లిదండ్రుల మృతితో ఏకాకులైన చిన్నారులు తేజస్వి నాగసాయి (4), లిఖిత శ్రీ (2) భవిష్యత్‌ దృష్ట్యా తీవ్రంగా చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

అమ్మమ్మ గార్డియన్‌గా చిన్నారుల పేరుతో ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీతో వారి జీవనం సాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకం వర్తింప చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్‌ రామ్, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, తదితరులు.. చిన్నారుల తాత, అమ్మమ్మ దూలం యేసు, పద్మలు ఉంటున్న ఆనంద్‌ నగర్‌లోని ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రభుత్వ సాయానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం చిన్నారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.   

కఠిన చర్యలు తప్పవు 
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా పోలీసులకు íఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు. ఇందుకు మహిళా కమిషన్‌ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ.. లోన్‌ యాప్‌లను బ్యాన్‌ చేసే విధంగా పార్లమెంట్‌లో ప్రస్తావించామని, త్వరలో కఠిన చర్యలు తప్పవన్నారు.

చిన్నారులు ఉన్నత చదువులు చదివేలా తాను అంండగా నిలుస్తానని ప్రకటించారు. ఐసీడీఎస్‌ సహకారంతో చిన్నారుల చదువుకు పూర్తి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్‌సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

నిందితుల కోసం మూడు బృందాలు 
దంపతుల ఆత్మహత్యకు కారణమైన లోన్‌ యాప్‌ బాధ్యులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఏఎస్పీలు ఎం.రజనీ, జి.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ యాప్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు.

దుర్గారావు పలు రుణ యాప్‌ల ద్వారా రూ.50 వేల వరకు రుణం తీసుకున్నారని తెలిపారు. లోన్‌ యాప్‌ల వారు ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. అశ్లీల ఫొటోలు, వీడియోలుగా మార్చి.. లోన్‌ తీసుకున్న వారి కాంటాక్ట్‌ నంబర్లకు పంపిస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నారన్నారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top