గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్‌: సీఎం జగన్

CM YS Jagan Present Service Awards To Volunteers - Sakshi

వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసిన సీఎం

సాక్షి, కృష్ణా జిల్లా: సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామ, వార్డు వలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు. పరిపాలన అంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతోందని.. లంచం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ‘‘ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ మన్ననలు పొందుతున్నారు. రూపాయి లంచం లేకుండా పెన్షన్ అందిస్తున్న మీరు గొప్ప సైనికులు. పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనస్సున్నవారు. ఒక వ్యవస్థలో వివక్ష లేకుండా వాలంటీర్లు పని చేస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా నేడు వాలంటీర్ భావిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మీరు క్రమశిక్షణతో ఉండి.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారు.. వారి పాపానికి వారే బాధ్యులు. ధర్మాన్ని నెరవేర్చాలని కోరుతున్నా. మానవ సేవే మాధవ సేవ.. అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరుతున్నానని’’ సీఎం జగన్‌ అన్నారు.

సేవా దృక్పథం పనిచేస్తున్న వాలంటీర్లకు అవార్డులు అందజేస్తున్నాం. అత్యుత్తమ సేవలను వాలంటీర్లు అందిస్తున్నారు. సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామని వెల్లడించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

చంద్రబాబు కుళ్లుకుంటున్నారు: పేర్ని నాని

జగనన్న సైన్యం సేవ చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. నేడు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. మాట తప్పకుండా  ప్రజలకు సీఎం జగన్ సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్‌ పాలన చూసి దేశం మొత్తం గర్వపడుతోందన్నారు. సీఎం జగన్ పథకాలను మిగతా రాష్ట్రాల సీఎంలు కాపీ కొడుతున్నారన్నారు. రాష్ట్రం మొత్తంలో వలంటీర్ పేరు చెప్పలేని ఇల్లు ఉండదని.. గ్రామ వార్డు వాలంటీర్‌లు అందరూ బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేయాలని కోరుతున్నానని మంత్రి పిలుపునిచ్చారు.

దేశం యావత్తూ ఏపీ వైపు: పార్థసారథి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ, ప్రజలకు మేలు చేసేందుకు సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్‌ వైపునకు సీఎం జగన్ నడిపిస్తున్నారన్నారు. దేశంలో ఎంతో మంది నేతలు వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్నారని.. ప్రధాని మోదీ కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. దేశం యావత్తూ ఏపీ వైపు చూస్తోందన్నారు.

‘‘ప్రజాసమస్యలకు గ్రామాలే వేదికలుగా మారాయి. దళారీ చేతుల్లో బందీలు కాకుండా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అవినీతి లేని పారదర్శక పాలన రాష్ట్రంలో సాగుతోంది. సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవారికి ఒక భరోసా దొరికింది. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారమైందని’’ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.

చదవండి:
టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం!
రాష్ట్రంలో రూ.3,300 కోట్లతో రోడ్ల నిర్మాణం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top