‘అంతర్వేది’పై సీబీఐ..  | Sakshi
Sakshi News home page

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు

Published Fri, Sep 11 2020 3:37 AM

CM YS Jagan Orders CBI Inquiry In Antarvedi Chariot Fire Incident - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది.  

సీబీఐతో విచారణ జరిపించండి : డీజీపీ లేఖ 
కాగా, రథం దగ్థం కేసును సీబీఐతో విచారణ జరపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ గురువారం లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ఈ లేఖ రాశారు.   

ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇదిలా ఉంటే.. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. మంత్రులూ క్షేత్రస్థాయిలో పర్యటించి రథం దగ్థం సంఘటనపై సమీక్షించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. స్థానిక అధికారులూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాక.. ఆలయ ఈవో చక్రధరరావును సస్పెండ్‌ కూడా చేసింది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రూ.95లక్షలను మంజూరు కూడా చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే ఇన్ని చర్యలు స్పష్టంగా ఉన్నా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మత విద్వేషాల ముసుగులో రాజకీయంగా లబ్ధిపొందేందుకు, సర్కారుకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసే కుట్రలకు తెరలేపాయి.

‘సంక్షేమం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే..
నిజానికి అంతర్వేది రథం దగ్థం ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా నానాయాగీ చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు.. అన్ని రకాలుగా రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  సర్కారు ఇటీవలే టీటీడీ లెక్కల్నీ కాగ్‌ ఆడిట్‌ పరిధిలోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొన్ని దుష్టశక్తులు ఎప్పటికప్పుడు తమ వక్రబుద్ధిని ప్రదర్శించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంతర్వేది దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం రాజకీయ పరిశీలకులు, మేధావులు, తటస్థులు తదితర అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.  

Advertisement
Advertisement