
పులి బొమ్మను ఆసక్తిగా చూస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బాలినేని, అధికారి ప్రతీప్ కుమార్
సాక్షి, అమరావతి: పులుల సంరక్షణ చర్యలను పటిష్టంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు ఆయన అంగీకారం తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని చెప్పారు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు అవి ప్రయాణిస్తున్నాయని, కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్.ప్రతీప్‌కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.