Corona Vaccine: సిఫార్సులకు తావులేదు: సీఎం జగన్‌

CM Jagan Says same rule applies to everyone when it comes to vaccines - Sakshi

వ్యాక్సిన్‌ విషయంలో నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు అందరికీ ఒకటే నియమం, నిబంధన: సీఎం వైఎస్‌ జగన్‌

45 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్‌ తరువాతే మిగిలిన వారికి

రెండో డోస్‌ వారికి ప్రాధాన్యం

అందరికీ టీకాలిచ్చేదాకా కోవిడ్‌తో కలసి జీవించక తప్పదు.. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజ్‌ తప్పనిసరి

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ కచ్చితంగా అమలు కావాలి

లేదంటే ఎస్పీలు, కలెక్టర్లు విఫల మైనట్లు భావించాల్సి వస్తుంది

కేసులు 24 వేల నుంచి 16–15 వేలకు తగ్గటం సానుకూల పరిణామం

ఉభయ గోదావరి, చిత్తూరు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి

నెలలోనే ఆక్సిజన్‌ పంపిణీలో మంచి సమర్థత, ప్రగతి చూపించాం

ఆరోగ్యశ్రీ కింద 70% పైగా కోవిడ్‌ రోగులకు ఉచితంగా చికిత్స 

50% బెడ్స్‌ ఇవ్వాల్సిందే.. అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు

బీమా సంస్థలతో పోలిస్తే.. మనం ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి: ‘స్పందన’ సమీక్షలో సీఎం 

నా నుంచి మీదాకా.. ఒకటే
‘‘రెండో డోస్‌ టీకా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తాం. వ్యాక్సిన్‌ విషయంలో నా దగ్గర నుంచి మీ దగ్గర వరకూ ఒకే నిబంధన వర్తిస్తుంది. సిఫార్సులకు తావులేదు’’

ఆ మందులతో వ్యాపారం దుర్మార్గం..
‘‘కోవిడ్‌ చికిత్సకు ఆధిక రేట్లు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తొలుత ఫైన్‌ విధించాలి. మళ్లీ తప్పు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. ప్రాణాలు కాపాడతాయని భావిస్తున్న మందులతో వ్యాపారం చేయడం దుర్మార్గం. ప్రైవేటులోనైనా, ప్రభుత్వంలోనైనా.. ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో తప్పులు చేయడం చాలా తప్పు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’
– ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: అందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ శానిటైజ్‌ చేసుకోవడాన్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. లేదంటే ఆయా జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు విఫలమైనట్లుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఉన్నవి మినహా మిగతా వాటికి కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి పూర్తిగా వ్యాక్సినేషన్‌ అయిపోయిన తర్వాత మిగిలిన వారికి ఇస్తామన్నారు. 45 ఏళ్లు దాటిన వారిపై కోవిడ్‌ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొద్ది రోజులుగా కోవిడ్‌ కేసులు తగ్గుతున్నట్లు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోందన్నారు. పాజిటివ్‌ కేసులు 24 వేల నుంచి 16 – 15 వేలకు తగ్గడం సానుకూల పరిణామమన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్థితులు మెరుగు పడాల్సి ఉందని, ప్రధానంగా ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కోవిడ్‌ నియంత్రణ, చికిత్స, మందులు, ఆక్సిజన్, కర్ఫ్యూ అమలుపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

కోవిడ్‌ వ్యాప్తి అడ్డుకునేందుకే కర్ఫ్యూ..
కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించేందుకే కర్ఫూ విధించాం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ వెసులుబాటు కల్పించాం. అయితే ఆ సమయంలో కూడా 144 సెక్షన్‌ అమలులో ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి.

అందరికీ అభినందనలు..
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆశా వర్కర్లు మొదలు వలంటీర్లు, డాక్టర్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు ఆ విధుల్లో నిమగ్నమైన జాయింట్‌ కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సమర్థంగా పని చేశారు. అందుకు మీలో ప్రతి ఒక్కరికీ అభినందనలు. నిజానికి మన దగ్గర హైదరాబాద్, బెంగళూరు లాంటి టైర్‌ –1 నగరాలు కానీ, ఆ స్థాయి ఆస్పత్రులు కానీ లేనప్పటికీ కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. 

ఆరోగ్యశ్రీకి 50 శాతం బెడ్లు తప్పనిసరి..
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 28,737 మందికి అంటే 70 శాతానికి పైగా కోవిడ్‌ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎం ప్యానెల్‌ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కచ్చితంగా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలి.

24 గంటల్లోగా చర్యలు.. 
ఏ చికిత్సకు ఎంత అన్నది తెలియచేస్తూ స్పష్టంగా రేట్లు ప్రకటించాం. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే మనం ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్ల ప్రకారం రోగులకు కచ్చితంగా సేవలు అందాలి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి. ఆరోగ్యమిత్రలు, సీసీ కెమెరాలు సమర్థంగా పని చేయాలి. అప్పుడు ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. దాడులు జరిపిన తర్వాత అధిక చార్జీల వసూళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు చాలా ముఖ్యమైనవి. 24 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలా చర్యలు తీసుకోకపోతే నేరుగా నాకు నివేదిక అందాలి. కలెక్టర్లు ఎలాంటి తప్పులకూ ఆస్కారం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇది మహ్మమారి సమయం, ప్రతి పేదవాడికీ, ప్రతి రోగికీ సేవలు చేయాల్సిన సమయం. ఎవరైనా తప్పులు చేస్తే, అధికంగా చార్జీలు వసూలు చేస్తే.. వారి మీద చర్యలు తీసుకోకపోవడం తప్పే అవుతుంది. 

మన బంధువులు ఫోన్‌ చేస్తే..
104 కాల్‌ సెంటర్‌ను వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా ఏర్పాటు చేశాం. కలెక్టర్లు దీన్ని ఓన్‌ చేసుకోవాలి. మన బంధువులు ఫోన్‌ చేస్తే ఎలా రెస్పాండ్‌ అవుతామో... 104కి ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాగే స్పందించాలి. సరిగ్గా స్పందించకుంటే అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. 104 మన బిడ్డ లాంటిది. ఒకప్పుడు కాల్‌ సెంటర్‌కు రోజుకు 19 వేల కాల్స్‌ వచ్చేవి. ఇప్పుడు 7 వేలకు తగ్గాయి. అంటే పాజిటివ్‌ కేసులు తగ్గాయనడానికి ఇదొక సంకేతం. అనుకున్న సమయంలోగా పరీక్షలు, మందులు, బెడ్స్‌
కేటాయింపులు జరగాలి.

జర్మన్‌ హ్యాంగర్లు..
కోవిడ్‌ బాధితులకు సత్వర చికిత్స కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న జర్మన్‌ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. వాటిలో ఆక్సిజన్‌ సరఫరా ఏర్పాట్లు చేయాలి. ఎయిర్‌ కండిషన్‌ సదుపాయం ఉండాలి. శానిటేషన్‌ బాగుండాలి, మంచి ఆహారం అందించాలి.

ఆక్సిజన్‌ సరఫరా...
నెల క్రితం వరకు రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా 330 టన్నులు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ 600 టన్నుల పైచిలుకు మనం పంపిణీ చేస్తున్నాం.ఆక్సిజన్‌ పంపిణీలో మంచి సమర్థత, ప్రగతి చూపించాం. తుపాను సమయంలో కూడా సరిపడా నిల్వ చేయగలిగాం. కనీసం 2 రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచగలిగాం. సీనియర్‌ అధికారి కృష్ణబాబుతోపాటు ఆరోగ్యశాఖ అధికారులు గట్టిగా కృషి చేసి ఆక్సిజన్‌ను నిల్వ చేయగలిగారు. 

సమర్థంగా వినియోగించుకోవాలి.. 
ఉన్న బెడ్లు ఎన్ని? ఎంత ఆక్సిజన్‌ వాడుకుంటున్నాం? ఎంత అవసరం? తదితరాలపై ఆడిటింగ్‌ సక్రమంగా జరగాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దాలి. ఆక్సిజన్‌ రవాణాకు సంబంధించి జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ సమర్థంగా పని చేయాలి. ఆక్సిజన్‌ నిల్వలను ప్రతి ఆస్పత్రిలో సక్రమంగా ఉంచేలా చూసుకోవాలి. తిరుపతి లాంటి ఘటనలు జరగకూడదు. ఎక్కడైనా ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సకాలంలో రాని పక్షంలో పరిస్థితులను ముందుగానే బేరీజు వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి.

రెమిడెసివర్‌పై నియంత్రణ..
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెమిడెసివర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారానికి 50 వేల ఇంజక్షన్లు ఇస్తున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రులకు 60 వేలు ఇచ్చాం. రెమిడెసివర్‌ ఇంజక్షన్లపై గట్టి నియంత్రణ సాధించగలిగాం. అందువల్ల కొరత లేకుండా ఇవ్వగలుగుతున్నాం. ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్మడం, వాటిని దారి మళ్లించడం లాంటివి జరగకూడదు. 

దేశవ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్లకు కొరత..
బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్లకు దేశవ్యాప్తంగా కొరత ఉంది. ఒక్కో రోగికి వారానికి కనీసం 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3 వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2 వేల ఇంజక్షన్లు వస్తాయని చెబుతున్నా సరిపోని పరిస్థితి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వీలైనన్ని ఇంజెక్షన్లు తెప్పించడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. వీటిని జాగ్రత్తగా వినియోగించడంపై దృష్టి పెట్టాలి.

వ్యాక్సిన్లపై వాస్తవాలు...
ఇప్పటివరకూ 23,69,164 మందికి రెండు డోసులు వ్యాక్సిన్లు ఇచ్చాం. 33,11,697 మందికి ఒక్క డోసు టీకా ఇచ్చాం. వ్యాక్సిన్‌ పరిస్థితులు ఏమిటో చాలాసార్లు చెప్పాం. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. 18 ఏళ్లు పైబడ్డ వారికి 172 కోట్ల డోసులు అవసరం. మనకు 7 కోట్ల డోసులు కావాలి. వ్యాక్సిన్ల విషయంలో మెరుగైన పరిస్థితి రావాలంటే ఉత్పత్తి సామర్థ్యంపెరగాలి. కేంద్రం కోటా ప్రకారమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవీ వాస్తవ పరిస్థితులు.

కాస్త సున్నితంగా ఉందాం...!
‘‘ఉద్యోగులు సరిగా పని చేయడం లేదని ఒకరిద్దరు అధికారులు నిగ్రహాన్ని కోల్పోవడం, చర్యలకు దిగడం లాంటి ఘటనలు కొన్నిచోట్ల చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరూ ఒత్తిడితో పని చేస్తున్నారనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. తిట్టి పని చేయించుకోవడం వల్ల లాభం లేదు. ఎవరైనా పొరపాట్లు చేస్తే వారి పట్ల కాస్త సానుకూలంగా ఉంటూ నచ్చచెప్పి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా అసాధారణ పరిస్థితుల్లో పని చేస్తున్నాం. మన ప్రవర్తనలో కాస్త సున్నితత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు ఘటనలు జరుగుతాయి.. జరగకుండా ఉండవు. కానీ అలాంటివి జరిగినప్పుడు వాటిని సానుకూలంగా చూసి నచ్చజెప్పి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది’’

కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు: సింఘాల్‌
సీఎం సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కోవిడ్‌ కేసులు మే 16 – 22 తేదీల మధ్య పట్టణ ప్రాంతాల్లో 48.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 51.7 శాతం నమోదు కాగా కొన్ని పత్రికల్లో రూరల్‌ ప్రాంతాల్లో అతి ఎక్కువగా కేసులున్నట్లు ప్రచురిస్తున్నారని చెప్పారు. సరైన అవగాహన, పరిజ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు రాస్తున్నారన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ పలుమార్లు వెళ్లి సర్వే చేశారని, ప్రతి మూడు రోజులకు ఒకసారి సర్వే చేస్తున్నారని, జ్వరం సహా ఎలాంటి లక్షణాలున్నా పరీక్షలు చేస్తున్నారని వివరించారు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. అనంతపురం, విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, మిగిలిన జిల్లాల్లో కేసులు స్టెబిలైజ్‌ అవుతున్నాయని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top