క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు.. జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్‌

Cm Jagan Launched E Autos Under Garbage Free Ap Updates - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.

గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది.
చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?

త్వరలో రోజుకు 400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్‌ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్‌ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206  టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెట్టారు.
చదవండి: షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top