తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తణుకు, పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు
174 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భానుడి విశ్వరూపం
మరికొన్ని రోజులు ఎండ తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఆదివారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీలు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 13 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది. మరో 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి. ఉదయం 7 నుంచి సాయంత్ర 6 గంటల వరకూ ఎండ తీవ్రత ఉండడంతో రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. మరో మూడు రోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు
సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్️కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు
మరోవైపు ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. సోమవారం మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


