హామీల ఎగవేత, పాలనా వైఫల్యాలు, స్కామ్‌లపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా చంద్రబాబు స్కెచ్
వరుస క్రెడిట్ చోరీ డ్రామాలతో జనాన్ని ఏమార్చే యత్నం
నిన్న వెలిగొండ.. నేడు పోలవరం ఎడమ కాలువ.. ఈ కాలువనూ ఏటీఎంగా మార్చుకుని 2024 నాటికి మిగిలిన పనుల అంచనా వ్యయం పెంపు
అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగింత
ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు రూ.81.63 కోట్ల విలువైన పని రూ.307.41 కోట్లకు కట్టబెట్టిన సర్కారు
ఆ తర్వాత ఆ పనుల అంచనా వ్యయం రూ.796.65 కోట్లకు పెంపు
సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు రూ.137.65 కోట్ల పని రూ.331.73 కోట్లకు అప్పగింత
డీపీటీకి ఇదో నిదర్శనం అని ఎత్తిచూపుతున్న కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ నిపుణులు
అయినప్పటికీ కాంట్రాక్టు ఒప్పందంలోగా పనులు పూర్తి చేయలేని వైనం
అనకాపల్లి జిల్లా సరిహద్దుకు ఎడమ కాలువ ద్వారా 10,634 క్యూసెక్కులు చేరాలి.. కానీ.. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా 5 వేల క్యూసెక్కులు తరలించేలా ప్రణాళిక
పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కుదించేసిన దుస్థితి
తద్వారా కుడి, ఎడమ కాలువల కింద వరద సమయంలోనే కేవలం 1.58 లక్షల ఎకరాలకే నీళ్లందించే వీలు
ఈ లెక్కన 2.87 లక్షల ఎకరాలకు నీళ్లెలా అందిస్తారని విస్తుపోతున్న నిపుణులు

సాక్షి, అమరావతి: సోమవారం వెలిగొండ వేదికగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడటాన్ని ప్రజలు విస్మరించక ముందే.. బుధవారం పోలవరం ఎడమ కాలువ వేదికగా మరో క్రెడిట్ చోరీకి రంగం సిద్ధం అయింది. జలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే.. ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేక సమస్యలతో ముడిపడిందంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు శాపనార్థాలు పెట్టారు. అంతటితో ఆగకుండా పోలవరం కాలువల తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ సైంధవునిలా అడ్డుపడ్డారు. విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా కమీషన్ల కోసం 2015లో పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దాని ద్వారా వైఎస్ హయాంలో దాదాపు పూర్తయిన పోలవరం కుడి కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి, నదులు అనుసంధానం చేసేశానంటూ గప్పాలు కొట్టారు. అదే రీతిలో 2016లో గోదావరి ఎడమ గట్టుపై కమీషన్ల కోసం పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టిన చంద్రబాబు.. వైఎస్ హయాంలో సింహభాగం పూర్తయిన ఎడమ కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి ఏలేరులోకి ఎత్తిపోశారు. ఇప్పుడు అదే ఎత్తిపోతల ద్వారా పోలవరం ఎడమ కాలువలో 111.13 కిలోమీటర్ల వరకు (అనకాపల్లి జిల్లా సరిహద్దులోకి) తరలించి.. అక్కడ జల హారతి ఇచ్చి, అది తన ఘనతగా చాటుకోవడానికి సిద్ధపడటంపై సాగు నీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడూ ఇప్పుడూ పోలవరం ఏటీఎం
కమీషన్ల కోసం 2014–19 మధ్య పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019 ఎన్నికల ప్రచారంలో రాజమహేంద్రవరం సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇప్పుడు కూడా అదే పోలవరాన్ని సీఎం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పోలవరం ఎడమ కాలువ పనులను ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, నీటి పారుదల రంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా రోజుకు 17,580 క్యూసెక్కులను తరలించి.. ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, 560 గ్రామాలకు తాగు నీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు సరఫరా చేసేలా 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పనులు చేపట్టారు. దీంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలు మళ్లించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువను 177.809 కి.మీల పొడవున తవ్వాలి. అక్కడి నుంచి విశాఖకు నీటిని తరలించడానికి 10.850 కి.మీలు కాలువ తవ్వడంతో పాటు పాత కెనాల్‌ను 10.9 నుంచి 33.609 కి.మీ వరకు అభివృద్ధి చేయాలి.
ఈ పనులు చేపట్టేందుకు 10,398.835 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 2014 నాటికే 9,987 ఎకరాల భూమిని సేకరించి.. 134 కి.మీల పొడవున కాలువ తవ్వకం పనులు.. 113 కి.మీల పొడవున లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 2014–19 మధ్య బాబు సర్కార్.. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎడమ కాలువ పనులను కొనసాగించాయి. 2024 నాటికి 177.809 కి.మీల పొడవైన ప్రధాన కాలువ పనుల్లో.. తవ్వకం పనులు 12.727 కి.మీలు, లైనింగ్ పనులు 29.878 కి.మీలు, అక్విడెక్టులు, సైఫన్‌లు, జాతీయ రహదారులపై క్రాసింగ్ బ్రిడ్జిలు వంటివి 103 మాత్రమే మిగిలాయి. 5 ప్యాకేజీల్లో మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేశారు. ఆ ప్యాకేజీల పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. ఒక ప్యాకేజీ ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు.. రెండు ప్యాకేజీలను తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు.. మరో 2 ప్యాకేజీలు తనకు సన్నిహితుడైన రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీకి అధిక ధరలకు కట్టబెట్టేలా సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి.
రూ.81.63 కోట్ల పని అంచనా రూ.796.65 కోట్లకు పెంపు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను 2005 మార్చి 23న రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఈ పనుల్లో 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల పొడవున లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60–సీ నిబంధన కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించింది. ఆ పనులను రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే (మైదుకూరు) పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ (జేవీ)కు 5ఏ ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది. సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్, పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ చేసిన పనులు పోగా 5, 5ఏ ప్యాకేజీల్లో 2024 నాటికి రూ.81.63 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఆ పనుల వ్యయాన్ని 2023–24 ధరల ప్రకారం రూ.352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న బాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంటే.. రూ.270.97 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను ఆర్నెళ్లలోగా పూర్తి చేయాలని గడువు పెట్టి.. రూ.293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ టెండర్‌లో వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు బాబు సర్కార్ కట్టబెట్టింది. అంతటితో ఆగక.. ఈ పనుల అంచనా వ్యయాన్ని ఒకేసారి రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచుతూ 2026 జూన్ 5న ఉత్తర్వులిచ్చింది. అంచనా వ్యయం రూ.444.05 కోట్ల మేర పెంచేసినా, ఆ పనులను రాయల రఘు సంస్థే చేస్తోండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఇది మరో నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. 
రూ.137.65 కోట్ల పనిని రూ.331.73 కోట్లకు అప్పగింత
పోలవరం ఎడమ కాలువలో ఆరో ప్యాకేజీ (111 కి.మీ నుంచి 136 కి.మీ వరకు) 2024 నాటికి 4.050 కి.మీల పొడవున కాలువ తవ్వకం, 7.259 కి.మీ పొడవున లైనింగ్, 29 కాంక్రీట్ నిర్మాణాల పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనుల అంచనా వ్యయం రూ.137.65 కోట్లే. కానీ.. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లకు పెంచి 2024 అక్టోబరు 9న బాబు సర్కార్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పనులను రూ.331.73 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారు. అగ్రిమెంటు ప్రకారం ఈ పనులను ఆర్నెళ్లలోగా పూర్తి చేయాలి. కానీ.. పూర్తి చేయని బీఎస్సార్ ఇన్‌ఫ్రాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం..ఆ సంస్థ బాబుకు సన్నిహితునికి చెందినది కావడమేనని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. డీపీటీకి ఇది మరో ఉదాహరణగా చూపుతున్నారు.
పంపా అక్విడెక్టు పూర్తి చేయలేక..
ఎడమ కాలువలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టినా.. ఆర్నెళ్లలోగా కాదు కదా కనీసం ఏడాదిన్నరలో కూడా ఆ పనులను ప్రభుత్వం పూర్తి చేయించలేకపోయింది. ఆనకాపల్లి జిల్లా సరిహద్దు వరకు మిగిలిన పనుల్లో కొంత మేర పూర్తి చేశారు. ఎడమ కాలువలో 111.15 కి.మీ వద్దకు 10,634 క్యూసెక్కుల ప్రవాహం చేరాలి. కానీ.. పంపా రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌పై అక్విడెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయింది. ఈ అక్విడెక్టుకు సంబంధించి ఆరు వెంట్లలో పనులు చేయాల్సి ఉండగా.. మూడు వెంట్లలో మాత్రమే పనులు చేశారు. దాంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల నీటికి పుష్కర నీటిని జత చేసి, 5 వేల క్యూసెక్కులను తరలించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ 2 ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువ మీదుగా అనకాపల్లి జిల్లా సరిహద్దుకు నీటిని తరలించనుంది. అక్కడ బుధవారం సీఎం జల హారతి ఇవ్వనున్నారు.
పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 2024 ఆగస్టు 28న 41.15 మీటర్లకు కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తే ఎన్డీయేలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు నోరు మెదపలేదు. దాంతో పోలవరం రిజర్వాయర్ కాస్త బ్యారేజ్‌గా మారిపోయింది. దీని వల్ల పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఎడమ కాలువ ద్వారా పుష్కర ఎత్తిపోతల ఆయకట్టు, కుడి కాలువ ద్వారా తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టు.. రెండూ కలిపి 1.58 లక్షల ఎకరాలకే నీళ్లందించడానికి సాధ్యమవుతుంది. అది కూడా గోదావరి వరదల సమయంలోనే. అంటే.. మిగతా 5.62 లక్షల ఎకరాల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడానికి సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు తరలించే 5 వేల క్యూసెక్కులతో 4 జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.


