వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా | Chandrababu Govt: Commission scam in agricultural mechanization | Sakshi
Sakshi News home page

వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా

May 3 2026 5:10 AM | Updated on May 3 2026 5:11 AM

Chandrababu Govt: Commission scam in agricultural mechanization

నీకింత.. నాకింత అంటూ కంపెనీలతో బేరసారాలు

2025–26కు టెండర్లు ఖరారైనా ఒక్క పరికరం ఇవ్వని ప్రభుత్వం

ఆర్థిక సంవత్సరం ముగిసినా కొలిక్కిరాని డ్రోన్‌ పైలట్లు, సీహెచ్‌సీ గ్రూపుల ఎంపిక.. 

గతేడాది ఇవ్వాల్సిన పరికరాలు ఈ ఏడాది ఇచ్చేందుకు సన్నాహాలు

అధిక ధరలకు కోట్‌చేసిన, సామర్థ్యం లేని చైనా పరికరాలకు పచ్చజెండా 

జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించినా.. పరికరాల ధరలు పెంచేస్తున్న వైనం.. 

రూ.80 కోట్ల వరకు దండుకునేందుకు పన్నాగం

సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మ​‍​క్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్‌లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్‌చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. 

వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్‌) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్‌సీ గ్రూపులకు వెయ్యి కిసాన్‌ డ్రోన్లు, క్లస్టర్‌ స్థాయిలో 100 కంబైన్డ్‌ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్‌ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్‌ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్‌ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.

కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 
2025–26 సీజన్‌లో రూ.240 కోట్లతో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు 75 కిసాన్‌ డ్రోన్లు, సీహెచ్‌సీలకు 164 హైకాస్ట్‌ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్‌లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్‌ జీఎం రాజమోహన్‌ను బదిలీచేసి విజిలెన్స్‌ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్‌ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్‌ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్‌మెంట్‌కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్‌ ద్వారా కంపెనీల నుంచి కమీషన్‌ దండుకుంటున్నారని సమాచారం. 

ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్‌చేసిన కంపెనీలతో ఎంపానల్‌మెంట్‌ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్‌ నాప్‌సాక్‌ స్ప్రేయర్లు, పవర్‌ వీడర్‌/రీపర్, బ్రష్‌ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్‌ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్‌ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్‌ వీడర్‌ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్‌లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్‌కట్టర్‌ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.

పనితీరుతో పనిలేదు
రైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్‌ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్‌ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్‌చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్‌ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్‌లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్‌1 కోట్‌చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. 

ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్‌లైన్‌లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్‌లైన్‌లో పిలిస్తే ఒకసారి అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్‌లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్‌లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement