వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు | Chandrababu did nothing for the Veligonda project says Mekapati Rajamohan Reddy | Sakshi
Sakshi News home page

వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు

Sep 2 2026 5:18 AM | Updated on Sep 2 2026 5:18 AM

Chandrababu did nothing for the Veligonda project says Mekapati Rajamohan Reddy

రెండుసార్లు శంకుస్థాపన చేసి.. ఫీజుబులిటీ కాదని వదిలేశాడు  

వైఎస్సార్‌ హయాంలో 20.333 కిలోమీటర్ల సొరంగాలు నిర్మిస్తే.. 

వైఎస్‌ జగన్‌ హయాంలో 10.568 కిలోమీటర్ల మేర నిర్మించారు  

బాబు హయాంలో నిర్మించింది 6.686 కిలోమీటర్లే  

అలాంటిది ఈ ప్రాజెక్టు తానే పూర్తిచేసినట్టు చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు  

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పా­రు. పైగా సాంకేతికంగా ఈ ప్రాజెక్టు ఏమా­త్రం ఫీజుబులిటీ కాదని చంద్రబాబు పక్కన పెట్టేశారని గుర్తుచేశారు. కానీ నేడు ఈ ప్రాజెక్టు తన ఘనతే అంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 1996లోనే కాదు ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపనల డ్రామా ఆడిన చంద్రబాబు ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడ­లేదని చెప్పారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ తర్వాత రెండుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దీన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.

2004లో డాక్టర్‌ వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత చేపట్టిన జలయజ్ఞంలో భాగ­ంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నరసరావుపేటలో శంకుస్థాపన చేశా­రని చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్తున్న సమయంలో స్థానిక కమ్యూనిస్టు నేతలు ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టా­లని కోరారని తెలిపారు. పూల సుబ్బయ్య పేరు పెడితే ఏమైనా అభ్యంతరమా? అని వైఎస్సార్‌ పక్క­నే ఉన్న తమను అడిగారని, తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అక్కడికక్కడే పూల సుబ్బయ్య పేరు ఈ ప్రాజెక్టుకు పెడుతున్నట్టు ప్రకటించారని వివరించారు. 

ఆరోజు వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోతే ఈరోజు చంద్రబాబు ప్రారంభించే పరిస్థితి వచ్చేదే కాదన్నారు. వైఎస్సార్‌ హయాంలో జలయజ్ఞం కింద 2004–09 మధ్య ఈ ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించారని, మొత్తం 37.587 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాల్సి ఉండగా దాదాపు 20.333 కిలోమీటర్ల మేర నిర్మించారని చెప్పారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నా­రు. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాలు పూర్తిచేశారని చెప్పారు. 

అనంతరం సీఎం అయిన వైఎస్‌ జగన్‌ మిగిలిన 10.568 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు పూర్తిచేయడమే కాకుండా డ్యామ్‌ పనులు కూడా చేపట్టారని తెలిపారు. సొరంగాల పనులు పూర్తిచేసిన వైఎస్‌ జగన్‌ 2024 మార్చి 6న వాటిని జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరి­గా­యన్నారు. ఈ ప్రాజెక్టు పేరు చెబితే ఈ ప్రాంత ప్రజ­లు దివంగత వైఎస్సార్‌తో పాటు ఆయన తనయు­డు జగన్‌ను గుర్తుచేసుకుంటారని చెప్పా­రు.  

మాగుంట ఇంత దిగజారతాడనుకోలేదు 
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజ­కీయ లబ్ధి కోసం ఇంత నీచానికి దిగజారతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని రాజమోహన్‌రెడ్డి చెప్పా­రు. వెలిగొండ ప్రారంబోత్సవ సభలో వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి మాగుంట మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్య­­లను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మా­గుంట కుటుంబానికి రాజకీయభిక్ష పెట్టింది దివంగత వైఎస్సార్‌ అని గుర్తుచేశారు.  

వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇలాంటి వ్యా­ఖ్య­లు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదని చెప్పా­రు. ఇలాంటి వ్యాఖ్యలు మాగుంట నోటి వెంట విన్నప్పుడు ఆయన రాజకీయంగా పతనమైపోయాడేమో అనిపించిందన్నారు. మాగుంట వ్యాఖ్య­లను ప్రజలు ఏమాత్రం హర్షించరని చెప్పారు. రాజకీయంగా మా­గుంటకు ఇది మాయనిమచ్చగా మిగిలిపోతుందని మేకపాటి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement